Lucknow Super Giants vs Gujarat Titans: ఐపీఎల్‌ 2023 సీజన్ 24వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ (GT) మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు సాధించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (66: 50 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వృద్ధి మాన్ సాహా (47: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు) రాణించాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాంలో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (0: 2 బంతుల్లో) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ పాండ్యా (66: 50 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (47: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఈ దశలో కృనాల్ పాండ్యానే సాహాను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.


ఆ తర్వాత వచ్చిన వారిలో ఎవరూ రాణించలేకపోయారు. ముఖ్యంగా పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు సహకరించడంతో ఒక దశలో పరుగులు రావడమే కష్టం అయిపోయింది. కానీ మెల్లగా ఇన్నింగ్స్ చివరికి వెళ్లే సరికి హార్దిక్ గేర్లు పెంచాడు. ముఖ్యంగా స్టార్ బౌలర్ రవి బిష్ణోయ్‌ని టార్గెట్ చేసుకుని సిక్సర్లతో చెలరేగాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (6 నాటౌట్: 12 బంతుల్లో) చివరి వరకు క్రీజులో ఉన్నా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడంటే అర్థం చేసుకోవచ్చు పిచ్ ఎంత టఫ్‌గా ఉందో. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రాలు చెరో వికెట్ పడగొట్టారు.




గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ


గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జోష్ లిటిల్, జయంత్ యాదవ్, శివం మావి, సాయి కిషోర్, కేఎస్ భరత్


లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్


లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జయదేవ్ ఉనద్కత్, కృష్ణప్ప గౌతం, డేనియల్ శామ్స్, ప్రేరక్ మన్కడ్, కరణ్ శర్మ