IPL Retired Players: 15 సీజన్లుగా మనల్ని అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ లో గోల్డెన్ డేస్ అయిపోయాయా..? మొన్న ఫ్రాంచైజీలన్నీ తమ రిటెన్షన్ లిస్ట్ సమర్పించిన తర్వాత వాటిలోని కొన్ని నిర్ణయాలు చూస్తే ఇదే అనిపిస్తోంది. నిజమే... మొన్న ఫ్రాంచైజీలు అన్నీ సమర్పించిన రిటెన్షన్ లిస్ట్ చూసిన తర్వాత చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కు ఇదే అనిపించి ఉండొచ్చు.. ఐపీఎల్ లో గోల్డెన్ డేస్ ముగిసిపోయాయా అని. ఎందుకంటే ఏళ్ల తరబడి, ప్రతి సీజన్ లోనూ మనల్ని అలరించిన స్టార్స్ అందరూ ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు. గతేడాది సురేష్ రైనా వేలంలో అమ్ముడవలేదు. దాంతో కామెంటేటర్ గా మారాడు. అక్కడ నుంచి మొదలైంది ఇది.
ఒక్కొక్కరుగా దూరం
మిస్టర్ ఐపీఎల్ రైనా లీగ్ కు దూరమయ్యాడు. అ తర్వాత గేల్. ఐపీఎల్ 2022 కు దూరంగా ఉంటున్నట్లు గేల్ ముందే ప్రకటించాడు. ఈ ఏడాది తిరిగి వస్తానని అప్పుడే చెప్పాడు. అయితే అది ఎంతవరకు సాధ్యమో చెప్పలేం. మునుపటి ఫాంలో లేని యూనివర్స్ బాస్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తాయో లేదో తెలియదు.
నెక్స్ట్ కీరన్ పొలార్డ్. 2010 నుంచి 2022 దాకా దాదాపు 13 సీజన్లు ముంబయి జట్టులో ఉన్నాడు పొలార్డ్. తన హార్డ్ హిట్టింగ్, పొదుపైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్ తో ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే ఈసారి ముంబయి పొలార్డ్ ను రిలీజ్ చేసింది. వేలంలోకి వెళ్లే అవకాశం ఉన్నా కీరన్ దాన్ని తీసుకోలేదు. ముంబయికి తప్ప వేరే జట్టుకు ఆడడాన్ని తాను ఊహించలేనని చెప్పి.. ఆ జట్టుకే బ్యాటింగ్ కోచ్ గా మారాడు.
ఇక డ్వేన్ బ్రావో. మొదట ముంబయి ఇండియన్స్ కు, మధ్యలో రెండేళ్లు గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన బ్రావో.. తన మిగతా ఐపీఎల్ అంతా చెన్నై సూపర్ కింగ్స్ కే ప్రాతినిథ్యం వహించాడు. చెన్నై అభిమానులకు, బ్రావోకు మధ్య మంచి బాండింగ్ ఉంది. మైదానంలో అతను ఎంటర్ టైన్ చేసే విధానాన్ని చెన్నై ఫ్యాన్స్ బాగా ఆస్వాదిస్తారు. అలాంటిది ఈసారి చెన్నై బ్రావోను రీటెయిన్ చేసుకోలేదు. కానీ వేలంలో ఈ ఆల్ రౌండర్ కు మంచి ధర పలికే అవకాశం ఉంది. మరి ఇతన్ని చెన్నై దక్కించుకుంటుందో, వేరే ఏ ఫ్రాంచైజీ అయినా తీసుకుంటుందో చూడాలి. అయితే వయసు రీత్యా బ్రావోకు ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు.
నెక్ట్స్ ధోనీ కూడా!
మొత్తం మీద చూసుకుంటే సుమారు పదేళ్లకుపైగా మనల్ని అలరించిన వెస్టిండీస్ స్టార్లందరూ ఒక్కొక్కరే దూరమైపోతున్నట్టు కనిపిస్తోంది. అలాంటి సత్తా ఉన్న వెస్టిండీస్ స్టార్లు ఇంకా ఎవరైనా ఉన్నారంటే అది... ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ మాత్రమే. వాళ్లు ఇంకెన్నేళ్లు కొనసాగుతారో చూడాలి. ఇక 2023 ఐపీఎల్ తర్వాత కెప్టెన్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ ముఖచిత్రం ఎంఎస్ ధోనీ కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.
కాబట్టి రైనాతో మొదలుకుని గేల్, పొలార్డ్, ఊతప్ప, మేబీ ధోనీ. ఇలా ఐపీఎల్ స్టార్స్ అందరూ ఒక్కొక్కే వెళ్లిపోతుంటే కచ్చితంగా గోల్డెన్ డేస్ ముగిసిపోయాయనే ఫీలింగ్ వస్తోంది.