Kolkata Knight Riders vs Punjab Kings: పంజాబ్ కింగ్స్(PBKS) తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR) బ్యాటర్లు జూలు విదిల్చారు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి భారీ స్కోరు సాధించారు. ఓపెనర్లు సునీల్ నరైన్... ఫిల్ సాల్ట్ మరోసారి చెలరేగిపోవడంతో కోల్‌కత్తా స్కోరు బోర్డు.. బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది. వీరిద్దరూ పది ఓవర్లలోనే 138 పరుగులు జోడించారు. తర్వాత వెంకటేష్ అయ్యర్... శ్రేయస్స్ అయ్యర్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేయంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది.
ఆది నుంచి దూకుడే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తాకు.. ఓపెనర్లు సునీల్ నరైన్... ఫిల్ సాల్ట్ మెరుపు ఆరంభం ఇచ్చారు. రెండో ఓవర్ నుంచి ఊచకోత ప్రారంభించిన సునీల్ నరైన్ ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్, ఫోర్‌తో తన విధ్వంసాన్ని ప్రారంభించిన నరైన్ తర్వాత మరింత చెలరేగిపోయాడు. కానీ పదిహేడు పరుగుల వద్ద నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచిన పంజాబ్... దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. మరోవైపు ఫిల్ సాల్ట్ కూడా మెరుపు బ్యాటింగ్ చేశాడు. హర్షల్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సులు.. ఒక ఫోర్ కొట్టాడు. నరైన్-సాల్ట్ విధ్వంసం ధాటికి పవర్ ప్లే ముగిసే సరికే కోల్‌కత్తా ఒక్క వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. పంజాబ్ ఫీల్డర్లు వరుసగా క్యాచులు జారవిడవడం కూడా కోల్‌కత్తాకు కలిసివచ్చింది. 44 పరుగుల వద్ద నరైన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కూడా పంజాబ్ ఫీల్డర్లు జారవిడిచారు. చాహర్ 6.5 ఓవర్‌లో నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను రబాడా జారవిడిచాడు. సునీల్ నరైన్ కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. కోల్‌కత్తా స్కోరు 100 పరుగులు దాటింది. తర్వాత నరైన్‌కు మరో అవకాశం లభించింది. చాహర్ బౌలింగ్‌లో నరైన్ ఎల్బీగా అంపైర్ అవుటివ్వగా.. కోల్‌క్తతా రివ్యూకు వెళ్లింది. ఇది నరైన్‌కు అనుకూలంగా వచ్చింది. నరైన్-సాల్ట్ మెరుపు బ్యాటింగ్‌తో తొమ్మిది ఓవర్‌లోనే కోల్‌కత్తా స్కోరు 118 పరుగులు చేసింది. 10 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 137 పరుగులు చేసింది. 138 పరుగుల వద్ద కోల్‌కత్తా తొలి వికెట్ కోల్పోయింది. 32 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 71 పరుగులు చేసి నరైన్ అవుటయ్యాడు. చాహర్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి నరైన్ పెవిలియన్ చేరాడు. అనంతరం సాల్ట్ కూడా అవుటయ్యాడు. 37బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 75 పరుగులు చేసి సాల్ట్ కూడా పెవిలియన్ చేరాడు. తర్వాత అండి రస్సెల్ 24, శ్రేయస్ అయ్యర్ 28, వెంకటేష్ అయ్యర్ 39 పరుగులతో రాణించడంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్ష్‌దీప్ రెండు, శామ్ కరణ్ ఒకటి... హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశారు.