KKR vs PBKS IPL 2024 Punjab Kings opt to bowl:  ఐపీఎల్‌ (IPL)2024 లో 17 వ  సీజన్‌లో భాగంగా  కోల్‌కతా(KKR), పంజాబ్‌ (PBKS)జట్లు  ఈడెన్ గార్డెన్స్‌లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌  కెప్టెన్  సామ్‌ కరన్  బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు కూడా సారథి శిఖర్‌ ధావన్‌ దూరమయ్యాడు. దాంతో అతడి  స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను సామ్ కరన్ నిర్వర్తిస్తున్నాడు.  పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తా... తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.


బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తాకు బలమైన  లైనప్‌ ఉంది.  సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్,  రింకూ సింగ్ వంటి బ్యాటర్లు కూడా బానే ఉన్నారు. అలాగే  ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలతో కోల్‌కత్తాకు బలమైన బౌలింగ్ ఉంది.  ఇక పంజాబ్ విషయానికి వస్తే భారత దేశీయ ఆటగాళ్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు రాణిస్తుండడం   కాస్త ఊరట కలిగిస్తోంది. వీరిద్దరూ క్రీజులో నిలబడి పరుగులు సాధిస్తుండడంతో పంజాబ్‌ బ్యాటింగ్‌ లోపాలు పెద్దగా  బహిర్గతం కావడం లేదు.  కానీ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఫామ్ పంజాబ్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. జితేష్ శర్మ కూడా వరుసగా విఫలమవుతుండడం పంజాబ్‌కు తలనొప్పిగా మారింది.  ప్రస్తుత కెప్టెన్ శామ్ కరణ్‌... కగిసో రబాడకు ఇతర ఆటగాళ్ల నుంచి మరింత మద్దతు అవసరం. అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ లు కూడా వికెట్లు  తీసేపనిలో  ఘోరంగా విఫలమవుతున్నారు. 


హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ  ఈ రెండు జట్లు 32 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో కోల్‌కత్తా 22 సార్లు, పంజాబ్‌ 11 సార్లు విజయం సాధించింది. 2012, 2014 సంవత్సరాల్లో కోల్‌కత్తా టైటిళ్లు విజయం సాధించింది. గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో కోల్‌కత్తా మాజీ ఓపెనర్‌ గంభీర్‌ 492  అత్యధిక పరుగులు చేశాడు. తర్వాత 438 పరుగులతో రాబిన్ ఉతప్ప రెండో స్థానంలో ఉన్నాడు. ఆండ్రూ రస్సెన్‌ 402 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ రెండు జట్ల మధ్య పంజాబ్‌పై కోల్‌కత్తా బౌలర్‌ 33 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తర్వాత పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ 19 వికెట్లతో రెండో స్థానంలో, పీయూష్ చావ్లా 14 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 2018 సీజన్‌లో కోల్‌కత్తా.... 245 పరుగుల భారీ స్కోరు చేసింది. సునీల్ నరైన్, దినేష్ కార్తీక్ అర్ధ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌  214 పరుగులకే ఆలౌటైంది. 2014 ఎడిషన్‌లో పంజాబ్‌ 132 పరుగుల అత్యల్ప స్కోరు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. కోల్‌కత్తాను కేవలం 109 పరుగులకే ఆలౌట్‌ చేసింది.  


పంజాబ్ జట్టు: 


సామ్ కరన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, రిలీ రొసోవ్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్‌ సింగ్


కోల్‌కతా  జట్టు:


శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సునీల్ నరైన్, రఘువంశి, ఫిలిప్‌ సాల్ట్ (వికెట్ కీపర్) , వెంకటేశ్‌ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రి రస్సెల్, రమణ్‌దీప్‌ సింగ్, దుష్మంత చమీర, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్ రాణా