KL Rahul:
అనుకున్నదే జరిగింది! కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం తీవ్రమైనదేనని తేలింది! దాంతో ఐపీఎల్ 2023 మిగిలి సీజన్, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అతడు దూరమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచులో అతడు గాయపడిన సంగతి తెలిసిందే. అతడి గాయాన్ని పరీక్షించిన బీసీసీఐ వైద్యబృందం శస్త్రచికిత్స చేయాల్సిందిగా సూచించింది.
ఎకనా స్టేడియం వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఆర్సీబీ ఇన్నింగ్సు ఆరంభంలోనే ఒక బౌండరీని ఆపబోయిన రాహుల్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో కొందపడ్డాడు. నొప్పితో విలవిల్లాడాడు. అతడిని మైదానం నుంచి తీసుకెళ్లడానికి స్ట్రెచర్ సైతం తీసుకొచ్చారు. అయితే నొప్పి భరించిన రాహుల్ సపోర్ట్ స్టాఫ్ సాయంతోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. ఫిజియోల సాయంతో కాస్త రికవర్ అయ్యాడు. అయితే జట్టు ఓటమి అంచున ఉండటంతో ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు.
కేఎల్ రాహుల్‌ను స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా హ్యామ్‌స్ట్రింగ్ ప్రాంతంలో వాపు ఉన్నట్టు వైద్యులు చెప్పారు. వాపు తగ్గేంత వరకు స్కానింగ్ తీయడానికి వీలుండదని పేర్కొన్నారు. దాంతో అతడు తిరిగొచ్చి జట్టుతో కలిశాడు. చెన్నై మ్యాచులో ఆడలేదు. మ్యాచ్ ముగిశాక రాత్రికి ముంబయికి వెళ్లి బీసీసీఐకి రిపోర్టు చేశాడు. అతడిని పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు.
'వైద్య బృందం సూచన మేరకు తొడ గాయానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. రాబోయే రోజుల్లో రిహబిలిటేషన్, రికవరీ మీదే దృష్టి సారిస్తాను. ఇది కఠిన నిర్ణయమేనని తెలుసు. కానీ రికవరీ మీదే ఫోకస్ చేయడం సరైన పని. లక్నో సూపర్ జెయింట్స్‌ను కఠిన సమయంలో వదిలి వెళ్లడం సారధిగా బాధిస్తోంది. కానీ కుర్రాళ్లు అద్భుతంగా ఆడతారని, గర్వపడేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. పక్క నుంచి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటాను' అని కేఎల్ రాహుల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సుదీర్ఘ సందేశం పెట్టాడు.
'వచ్చే నెల్లో టీమ్‌ఇండియా తరఫున ఓవల్ మైదానంలో ఆడలేకపోతున్నందుకు బాధగా ఉంది. తిరిగి నీలం రంగు జెర్సీ వేసుకొని అదరగొట్టేందుకు ప్రయత్నిస్తాను. టీమ్‌ఇండియాకు ఆడటమే నాకు తొలి ప్రాధాన్యం. నా వెన్నంటే ఉన్న అభిమానులు, లక్నో యాజమాన్యం, బీసీసీఐ, నా టీమ్‌మేట్స్‌కు కృతజ్ఞతలు. కష్ట సమయంలో వారు నాకు అండగా నిలిచారు. మీరు పంపించిన సందేశాలు నన్నెంతో మోటివేట్ చేశాయి. బలంగా తిరిగొచ్చేందుకు బలాన్ని ఇస్తున్నాయి. నా రికవరీ గురించి మీకు వెంటవెంటనే తెలియజేస్తాను. గాయాల నుంచి కోలుకోవడం సులభం కాదు. ఏదేమైన శాయశక్తులా ప్రయత్నిస్తాను. మీ అండదండలకు ధన్యవాదాలు' అని రాహుల్ పోస్టు చేశాడు.
కేఎల్ రాహుల్ కెరీర్ ఈ మధ్య గాడి తప్పింది. వరుసగా గాయాల పాలవుతున్నాడు. బ్యాటింగ్ పరంగానూ నెమ్మదించాడు. 2018 నుంచి ఐపీఎల్‌లో 500+ స్కోర్లు సాధించిన అతడు ఈ సారి 226 వద్దే ఆగిపోయాడు. రీసెంట్‌గా టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నుంచి తప్పించారు. దాదాపుగా ఏడాది పాటు టీ20 క్రికెట్ ఆడలేదు. అయితే 50 ఓవర్ల క్రికెట్లో మాత్రం అదరగొట్టాడు. మూడు ఫార్మాట్ల ప్రదర్శనను బట్టి బీసీసీఐ అతడి గ్రేడ్ ఏ కాంట్రాక్టును గ్రేడ్ బికి తగ్గించింది. రాహుల్ లేకపోవడంతో మిగిలిన మ్యాచులకు ఎల్‌ఎస్‌జీని కృనాల్ పాండ్య నడిపించనున్నాడు.