KKR vs SRH IPL 2023: 


కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమను ఓడించలేదని.. తామే స్వయంగా ఓడిపోయామని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ బ్రియన్‌ లారా అన్నాడు. ఆరెంజ్‌ ఆర్మీ బ్యాటర్లను విమర్శించాడు. తమ వైపు వచ్చిన మ్యాచును చేజేతులా వదిలేశారని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌ యూనిట్లో కాస్త పాజిటివిటీని పెంచాల్సి ఉందని వెల్లడించాడు. మ్యాచ్‌ ముగిశాక మీడియాతో మాట్లాడాడు.


'మేం ఇప్పటికీ పవర్‌ ప్లేలో వికెట్లు చేజార్చుకుంటున్నాం. ఇదే మమ్మల్ని వెనకడుగు వేసేలా చేస్తోంది. దాంతో మేం మళ్లీ హెన్రిచ్‌ క్లాసెన్‌ పైనే ఆధారపడ్డాం. ఇంకాస్త కష్టపడాలని కోరాం. అతడు ఆరో స్థానంలో వస్తున్నాడు. అతడి కన్నా ముందు ఐదుగురు మంచి బ్యాటర్లు మాకు ఉన్నారు. కానీ ప్రతిసారీ భారం అతడి మీదే పడుతోంది. ఇలాంటి మ్యాచుల్ని గెలిపించాల్సిన బాధ్యతను వారు తీసుకోవాల్సింది. కానీ పని చేయడం లేదు' అని బ్రియన్‌ లారా అన్నాడు.


'భాగస్వామ్యాలు నెలకొల్పడంపై మేం మరింత దృష్టి పెట్టాలి. మ్యాచ్‌పై అవగాహన పెంచుకోవాలి. అగ్రెసివ్‌గా ఆడటం ముఖ్యమే కానీ చివరి వరకు నిలబడటం అంతకన్నా కీలకం' అని లారా అన్నాడు. కేకేఆర్‌ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని ఆయన ప్రశంసించాడు.


'వరుణ్‌ చక్రవర్తి, సునిల్‌ నరైన్‌ నాణ్యమైన స్పిన్నర్లు. టోర్నీ సాగే కొద్దీ స్పిన్నర్లు కీలకం అవుతుండటాన్ని గమనిస్తున్నాం. నరైన్‌, చక్రవర్తి ప్రపంచ స్థాయి స్పిన్నర్లు. మార్క్‌క్రమ్‌, క్లాసెన్‌ మంచి భాగస్వామ్యం అందించారు. ఒకట్రెండు ఓవర్లలో షాట్లు ఆడటంతో మ్యాచులోకి వచ్చాం. ముఖ్యమైన సమయంలో వికెట్లు పోవడంతో పట్టు కోల్పోయాం. నిజానికి మేమీ మ్యాచ్‌ గెలవాల్సింది. కేకేఆర్‌ మమ్మల్ని ఓడించే స్థితిలో లేదు. మేమే స్వయంగా ఓడిపోయాం' అని లారా పేర్కొన్నాడు.


Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2023 సీజన్ 47వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమి పాలైంది. చివరి ఐదు ఓవర్లలో 38 పరుగులు చేయాల్సిన దశలో కేవలం 32 పరుగులు మాత్రమే ఓడిపోయింది. చివరి ఐదు ఓవర్లలో మూడు ఓవర్లను వేసిన వరుణ్ చక్రవర్తి తన 18 బంతుల్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్ ఓటమి రాత రాశాడు.



ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్‌కతా తరఫున రింకూ సింగ్ (46: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరి ఐదు ఓవర్లలో కోల్‌కతా కేవలం 42 పరుగులే చేయగలిగింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (41: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అత్యధిక పరుగులు సాధించాడు.