LSG Owner Serious On KL Rahul:  ఆటలో గెలుపోటములు అనేవి సహజం. ఎంత దిగ్గజ ఆటగాడికైనా కాలం కలిసి రాకపోయినా, మైదానంలో అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోయినా ఎదురు దెబ్బలు తప్పవు. ఒక బ్యాడ్ సీజన్ అనేది ఐపీఎల్‌(IPL)లో ఇప్పటిదాకా స్టార్ ప్లేయర్స్ అందరూ చూసిందే. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా మనదేశంలోని స్టార్ ప్లేయర్లు అందరూ బ్యాడ్ సీజన్స్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వారే. కానీ వారు బౌన్స్ బ్యాక్ అయ్యారంటే దానికి కారణం ఆ టీమ్స్ మేనేజ్‌మెంట్స్ నుంచి వారికి దొరికిన సపోర్ట్. కానీ కేఎల్ రాహుల్‌కు అది తక్కువ అయినట్లు నిన్న రాత్రి ఇంటర్నెట్లో వైరల్ అయిన ఒక వీడియోను చూసి చెప్పవచ్చు. 


లక్నో సూపర్ జెయింట్స్(LSG) యజమాని సంజీవ్ గోయెంకా(Sanjiv Goenka)... కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద మైదానంలోనే సీరియస్ అయిన విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కేఎల్ రాహుల్(KL Rahul) చెప్తున్నది కూడా వినకుండా సంజీవ్ గోయెంకా సీరియస్ అవ్వడం చూడవచ్చు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అవమానకర రీతిలో ఓటమి పాలవడం కూడా ఇందుకు కారణం. 


ఒక ఆటగాడిగా కేఎల్ రాహుల్ ఎంతో సాధించాడు. అటువంటి ప్లేయర్ మీద మినిమం రెస్పెక్ట్ ఉండాలి కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గోయెంకాకు ఇటువంటి వివాదాలు కొత్తేమీ కాదు. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు ఉన్నప్పుడు ఏకంగా మహేంద్ర సింగ్ ధోనినే కెప్టెన్సీ నుంచి తప్పించాడు. ధోనిపై వివాదాస్పద ట్వీట్లు కూడా చేశాడు. ఇప్పుడు అభిమానులు దీన్ని కూడా బయటకు తీస్తున్నారు.


బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘోర ఓటమి పాలైంది. 167 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 75 పరుగులు, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా చేశారు. వీరి బ్యాటింగ్‌తో కేఎల్ రాహుల్ షాక్ అయ్యాడట. ఈ విషయాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో రాహుల్ స్వయంగా చెప్పాడు. ‘నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ టీవీల్లో చూశాం కానీ ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. వికెట్ ఎలా మార్పు చెందుతుందో తెలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. అది ఎక్కువగా మారలేదు. కానీ మొదటి బంతి నుంచే వేగంగా ఆడాలన్న వారి మైండ్‌సెట్, యాజమాన్యం నుంచి లభించిన స్వేచ్ఛ కారణంగానే ఇది సాధ్యం అయింది. వారిని ఆపాలంటే చేయాల్సింది ఒకటే. పవర్‌ప్లేలోనే వికెట్లు తీయాలి. అందులో మేం విఫలం అయ్యాం.’ అని కేఎల్ రాహుల్ అన్నాడు. 


ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ నెట్‌రన్‌రేట్ కూడా దారుణంగా పడిపోయింది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ కింద ఆరో స్థానానికి పడిపోయింది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే లక్నో మిగిలిన 2 మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాల్సిందే. ఎందుకంటే ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే విజయాలతో పాటు నెట్‌రన్‌రేట్ కూడా అవసరం అవుతుంది.