SRH Vs LSG IPL 2024 Sunrisers Hyderabad won by 10 wkts: లక్నోపై  హైదరాబాద్‌ బ్యాటర్లు శివాలెత్తారు. బౌండరీల ఊచకోత కోశారు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కోల్పోకుండా కేవలం 9.4 ఓవర్లలోనే సునాయసంగా ఛేదించేశారు. హైదరాబాద్‌ ఓపెనర్లు ట్రానిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ ఊచకతోకు లక్నో బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది  ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 89 పరుగులు చేయగా.... అభిషేక్‌ శర్మ 28 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసంతో హైదరాబాద్‌ మరో 62 బంతులు మిగిలి ఉండగానే లక్నోపై విజయం సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. 


లక్నోఆటగాళ్ళు  ఆదిలోనే తడబాటు 
 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో బ్యాటింగ్‌కు దిగింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు లక్నో బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. బంతిబంతికి ఇబ్బందిపడ్డ లక్నో బ్యాటర్లు.... పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డారు. మూడో ఓవర్‌లో భువీ.... లక్నోను తొలి దెబ్బ తీశాడు. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన ఓవర్‌లో నితీశ్‌రెడ్డి బౌండరీ లైన్‌ వద్ద పట్టిన అద్భుత క్యాచ్‌కు క్వింటన్‌ డికాక్‌ అవుటయ్యాడు. రెండు పరుగులు మాత్రమే చేసిన డికాక్‌ పెవిలియన్‌ చేరాడు. 13 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత భువీ లక్నోకు మరో షాక్‌ ఇచ్చాడు. మూడు పరుగులు చేసిన స్టోయినిస్‌ని  అవుట్‌ చేశాడు. దీంతో 23 పరుగులకే లక్నో రెండు వికెట్లు కోల్పోయింది.


పవర్‌ ప్లే లో లక్నో స్కోరు 27/2


హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లక్నో పవర్‌ ప్లే రెండు వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కూడా లక్నో బ్యాటర్ల కష్టాలు కొనసాగాయి. కమిన్స్‌ వేసిన పదో ఓవర్‌లో 29 పరుగులు చేసిన కెప్టెన్‌ రాహుల్‌ అవుటయ్యాడు.  తరువాత కృనాల్‌ పాండ్యా రనౌట్‌ కావడంతో లక్నో మరింత కష్టాల్లో పడింది. నికోలస్‌ పూరన్‌ కాసేపు ధాటిగా ఆడడంతో లక్నో మళ్లీ గాడిన పడినట్లు కనిపించింది.  నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోని లక్నోను ఆదుకున్నారు. పరుగులు రావడమే గగనమైన వేళ వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. పూరన్‌ 26 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆయుష్‌ బదోని 30బంతుల్లో 9 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. వీరిద్దరి పోరాటంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులకే పరిమితమైంది.ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ అద్భుత స్పెల్‌తో మెరిశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన భువీ 12 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు నేలకూల్చాడు.


పోటీ పడి అలవోకగా చితక్కొట్టిన సన్ రైజర్ ఓపెనర్లు


లక్నో ఇచ్చిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ బ్యాటర్లు అతి సులభంగా  చేధించారు.  ఒక్క వికెట్ కూడా పడకుండానే  లక్నో బౌలర్లపై  విజృంభించారు. ట్రావిస్ హెడ్ 89 పరుగులు, అభిషేక్ శర్మ  75  పరుగులతో బౌలర్లపై విరుచుకుపడ్డారు.  ట్రావిస్ హెడ్  30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో హోరెత్తించాడు.