SRH Vs LSG IPL 2024 Match 57:  హైదరాబాద్‌(Hyderabad)లోని ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌(SRH)తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) టాస్ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పిచ్‌ నెంబర్‌ 2ను ఉపయోగిస్తున్నారు. ఇదే పిచ్‌పై ముంబై(MI)పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోరు నమోదు చేసింది. బౌండరీ లైన్లు కూడా కాస్త దగ్గరగా ఉండడంతో ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పిచ్‌ కాస్త స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది.


పిచ్‌పై కొంచెం పగుళ్లు కనిపిస్తున్నాయని, ఇది బౌలర్లకు కాస్త ఉపయోగపడే అవకాశం ఉందని కామెంటేటర్లు అంచనా వేశారు. ఈ మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు హెడెన్‌ అన్నాడు. 200కుపైగా పరుగులు తేలిగ్గా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.  ఈ అంచనాల మధ్య టాస్‌ గెలిచిన లక్నో కెప్టెన్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.


బౌలర్లు మెరుస్తారా
హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌ ఎంతో కీలకంగా మారింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్‌  ఆరంభంలో మెరుపులు మెరిపించిన గత కొన్ని మ్యాచుల్లో విఫలమవుతోంది. సన్‌రైజర్స్ తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ఓడిపోయింది. ట్రావిస్ హెడ్ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమవుతుండడం హైదరాబాద్‌ను ఆందోళనపరుస్తోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గత నాలుగు మ్యాచుల్లో  కేవలం ఒక్కసారి మాత్రమే 30 పరుగుల మార్క్‌ను దాటాడు. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి కూడా కీలకసమయంలో వరుసగా విఫలమవుతున్నారు. నటరాజన్ బంతితో స్థిరంగా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. 



లక్నోకు పరీక్షే
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో తేలిపోయింది. ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా 200కుపైగా పరుగులు చేయగా లక్నో 137 పరుగులకే పరిమితమైంది. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ అవసరమైన వేళ రాణించకపోవడం లక్నోను వేధిస్తోంది. ఆయుష్ బదొని కూడా తేలిపోతున్నాడు. లక్నో పేస్‌ బౌలింగ్ చాలా  బలహీనంగా కనిపిస్తోంది. పేసర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్‌కు దూరం కావడంతోపాటు ఎడమచేతి వాటం పేసర్ మొహ్సిన్ ఖాన్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, స్టోయినిస్, స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్‌లు రాణించాలని లక్నో కోరుకుంటోంది.


హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌
2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు తన ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ఐపీఎల్‌ చరిత్రలో క్నో సూపర్‌ జెయింట్స్... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఈ మూడుసార్లు హైదరాబాద్‌పై లక్నోనే గెలిచింది.  ఈ మ్యాచ్‌లో ఏ టీమ్‌ విజయం సాధిస్తే వారికే ప్లే ఆఫ్స్‌ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.