Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కాస్ట్లీ ఓపెనర్ హ్యారీ బ్రూక్ (100 నాటౌట్: 55 బంతుల్లో, 12 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత శతకంతో అజేయంగా నిలిచాడు. తనతో పాటు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (50: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మెరుపు వేగంతో అర్థ సెంచరీ సాధించాడు.


229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులకు పరిమితం అయింది. కెప్టెన్ నితీష్ రానా (75: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రీసెంట్ సెన్సేషన్ రింకూ సింగ్ (58 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అజేయ అర్థ శతకం సాధించాడు.


కోల్‌కతాకు మొదటి ఓవర్లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను అవుట్ చేసి భువీ మొదట్లోనే కోల్‌కతాకు షాక్ ఇచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో కోల్‌కతా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


అనంతరం మరో ఓపెనర్ ఎన్ జగదీషన్, కెప్టెన్ నితీష్ రానా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరు నాలుగో వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులో కుదురుకున్న జగదీషన్‌ను మయాంక్ మార్కండే అవుట్ చేశాడు. హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.


ఆ తర్వాత నితీష్ రానా, రింకూ సింగ్ కలిసి కోల్‌కతాను లక్ష్యం వైపు నడిపించారు. ఈ జోడి ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. అనంతరం నితీష్ అవుటయ్యాడు. ఛేదించాల్సిన రన్ రేట్ చాలా ఎక్కువగా ఉండటంతో రింకూ సింగ్ కూడా ఏమీ చేయలేకపోయాడు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులకు పరిమితం అయింది.


టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ హ్యారీ బ్రూక్ (100 నాటౌట్: 55 బంతుల్లో, 12 ఫోర్లు, మూడు సిక్సర్లు) మొదటి బంతి నుంచే చెలరేగి ఆడాడు. అయితే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (9: 13 బంతుల్లో), వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (9: 4 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం అయ్యారు. అయితే అప్పటికే జట్టు స్కోరు ఐదు ఓవర్లలో 57 పరుగులకు చేరుకుంది.


ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌కు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (50: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) జత కలిశాడు. మార్క్రమ్ అయితే సిక్సర్లతో కోల్‌కతా బౌలర్లపై చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేశాడు. వీరు మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. అయితే మార్క్రమ్ అవుటైనా అభిషేక్ శర్మ (32: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), క్లాసెన్ (16 నాటౌట్: 6 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తగ్గేదేలే అన్నట్లు ఆడారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 228 పరుగులు చేసింది.


చివరి ఓవర్లో హ్యారీ బ్రూక్ శతకం పూర్తయింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ మూడు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ దక్కింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో హ్యారీ బ్రూక్‌దే మొదటి సెంచరీ కావడం విశేషం.