Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 228 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ (100 నాటౌట్: 55 బంతుల్లో, 12 ఫోర్లు, మూడు సిక్సర్లు) శతకంతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (50: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మెరుపు వేగంతో అర్థ సెంచరీ సాధించాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో హ్యారీ బ్రూక్‌దే మొదటి సెంచరీ కావడం విశేషం. కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయానికి 120 బంతుల్లో 229 పరుగులు అవసరం.
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ హ్యారీ బ్రూక్ (100 నాటౌట్: 55 బంతుల్లో, 12 ఫోర్లు, మూడు సిక్సర్లు) మొదటి బంతి నుంచే చెలరేగి ఆడాడు. అయితే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (9: 13 బంతుల్లో), వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (9: 4 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం అయ్యారు. అయితే అప్పటికే జట్టు స్కోరు ఐదు ఓవర్లలో 57 పరుగులకు చేరుకుంది.
ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌కు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (50: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) జత కలిశాడు. మార్క్రమ్ అయితే సిక్సర్లతో కోల్‌కతా బౌలర్లపై చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేశాడు. వీరు మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. అయితే మార్క్రమ్ అవుటైనా అభిషేక్ శర్మ (32: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), క్లాసెన్ (16 నాటౌట్: 6 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తగ్గేదేలే అన్నట్లు ఆడారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 228 పరుగులు చేసింది. చివరి ఓవర్లో హ్యారీ బ్రూక్ శతకం పూర్తయింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ మూడు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ దక్కింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అబ్దుల్ సమద్, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ డాగర్, వాషింగ్టన్ సుందర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఎన్ జగదీసన్, నితీష్ రానా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా