Lucknow Super Giants vs Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2023 సీజన్ 68వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయానికి 120 బంతుల్లో 177 పరుగులు కావాలి. కానీ ఈ మ్యాచ్‌లో అసలు టార్గెట్ ఉంది లక్నో సూపర్ జెయింట్స్‌కే. ఎందుకంటే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్ 1కు అర్హత సాధించాలంటే మాత్రం కోల్‌కతాను 79 పరుగులలోపు ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.


లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (58: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో అర్థ సెంచరీ సాధించాడు. కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది బౌలింగ్ ఆప్షన్లను ట్రై చేసింది. శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా రెండేసి వికెట్లు తీసుకున్నారు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే వారికి ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్ కరణ్ శర్మ (3: 5 బంతుల్లో) ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (28: 27 బంతుల్లో, రెండు సిక్సర్లు), వన్ డౌన్‌లో వచ్చిన ప్రేరక్ మన్కడ్ (26: 20 బంతుల్లో, ఐదు ఫోర్లు) రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు.


అయితే ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్‌లను (0: 2 బంతుల్లో) ఒకే ఓవర్లో అవుట్ చేసి వైభవ్ అరోరా లక్నోకు షాక్ ఇచ్చాడు. కృనాల్ పాండ్యా (9: 8 బంతుల్లో, ఒక సిక్సర్), క్వింటన్ డి కాక్ కూడా కాసేపటికే అవుటయ్యారు. దీంతో లక్నో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత నికోలస్ పూరన్ (58: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), ఆయుష్ బదోని (25: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) లక్నోను ఆదుకున్నారు. వీరు ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ ఆఖర్లో వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుట్ అయినా ఆఖర్లో కృష్ణప్ప గౌతం (11 నాటౌట్: 4 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా రెండేసి వికెట్లు తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా చెరో వికెట్ పడగొట్టారు.


లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్


లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ శర్మ, మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, ఎన్ జగదీశన్, డేవిడ్ వైస్


కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి


కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్