Delhi Capitals vs Chennai Super Kings: ఐపీఎల్ 2023 సీజన్ 67వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (87: 52 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (79: 50 బంతుల్లో, మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) కూడా భారీ అర్థ సెంచరీ సాధించాడు.
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా చెన్నై సూపర్ కింగ్స్ 52 పరుగులు చేసింది.
ఆ తర్వాత ఈ జోడి గేర్లు మార్చింది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్, కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదేశాడు. ఈలోపే అతని అర్థ శతకం కూడా పూర్తయింది. అతని తర్వాత డెవాన్ కాన్వే కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరి భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది.
ఈ సీజన్‌లో చెన్నైకి ఇది నాలుగో సెంచరీ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్. మొదటి వికెట్‌కు 142 పరుగులు జోడించిన అనంతరం చేతన్ సకారియా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే డెవాన్ కాన్వే కూడా అవుటయ్యాడు. చివర్లో శివం దూబే, రవీంద్ర జడేజా చెలరేగడంతో చెన్నై భారీ స్కోరు చేసింది.
ఈ మ్యాచ్‌లో చెన్నై తన తుదిజట్టులో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. ఇషాంత్ శర్మ స్థానంలో చేతన్ సకారియా జట్టులోకి వచ్చాడు. అలాగే లలిత్ యాదవ్‌కు తుది జట్టులో స్థానం దక్కింది.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రోసోవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
పృథ్వీ షా, ముఖేష్ కుమార్, ప్రవీణ్ దూబే, రిపాల్ పటేల్, అభిషేక్ పోరెల్
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్