Kolkata Knight Riders vs Gujarat Titans: ఐపీఎల్ 2023 సీజన్ 39వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ (81: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో షమి మూడు వికెట్లు తీసుకున్నాడు. గుజరాత్ విజయానికి 120 బంతుల్లో 180 పరుగులు కావాలి.
వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభం అయిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ నారాయణ్ జగదీషన్ (19: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 23 పరుగులు మాత్రమే.
ఆ తర్వాత వచ్చిన వారిలో కూడా ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్‌కు వెళ్తుంటే మరో ఎండ్‌లో రహ్మనుల్లా గుర్బాజ్ (81: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ గుర్బాజ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత ఆండ్రీ రసెల్ (34: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, జాషువా లిటిల్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడో స్థానంలోనూ, గుజరాత్ టైటాన్స్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా భారీ తేడాతో విజయం సాధిస్తే ఏకంగా మూడో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. అదే గుజరాత్ గెలిస్తే వారు మొదటి స్థానానికి వెళ్తారు.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
శుభమాన్ గిల్, శ్రీకర్ భరత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శివమ్ మావి, జయంత్ యాదవ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
నారాయణ్ జగదీశన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ శర్మ, మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, టిమ్ సౌథీ, కుల్వంత్ ఖేజ్రోలియా