IPL Auction 2023:
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ మరోసారి జాక్‌పాట్ కొట్టేశాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో భారీ ధర పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. కనీస ధర రూ.2 కోట్లతో పోలిస్తే అతడికి పెద్ద మొత్తమే దక్కింది! చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం విపరీతంగా పోటీ పడ్డాయి. చివరికి లక్నో దక్కించుకుంది.
వదిలేసిన సన్‌రైజర్స్
నికోలస్ పూరన్ చివరి సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. ఆ ఫ్రాంచైజీ రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 14 మ్యాచులాడి 38.25 సగటు, 144.34 స్ట్రైక్‌రేట్‌తో 306 పరుగులు చేశాడు. మొత్తం జట్టు స్కోరు అతడి వాటా 13.93 శాతంగా ఉంది. ఏదేమైనా ఆశించిన మేరకు అతడు అంచనాలు అందుకోలేదు. పెట్టిన ధరకు న్యాయం చేయలేదన్న ఉద్దేశంతో హైదరాబాద్ అతడిని వదిలేసింది. అలాంటి ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడటం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది.
విపరీతంగా పోటీ
ఈసారి వేలంలో నికోలస్ పూరన్ పేరు రాగానే చెన్నై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. రెండు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్డింగ్ వేయడంతో కాసేపట్లోనే ధర రూ.5 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో దిల్లీ ఎంటరైంది. త్రిముఖ పోటీతో ధర రూ.7 కోట్లకు చేరుకుంది. అప్పుడే బిడ్డింగ్ ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్.. దిల్లీతో పోటీపడటంతో క్షణాల్లో రూ.14 కోట్లకు చేరుకున్నాడు. రూ.15 కోట్ల వరకు దిల్లీ పోటీపడ్డా చివరికి లక్నో రూ.16 కోట్లు పెట్టి దక్కించుకుంది.
లక్నో వ్యూహం ఏంటి?
నికోలస్ పూరన్ కోసం లక్నో ఇంతలా ఎందుకు పోటీ పడిందో ఎవరికీ అర్థం కాలేదు! అయితే స్పష్టమైన వ్యూహంతోనే అతడిని కొనుగోలు చేయాలని ఆ ఫ్రాంచైజీ నిర్ణయించుకుందని తెలిసింది. ముందు రోజు జరిగిన మాక్ ఆక్షన్‌లోనూ ఎల్‌ఎస్‌జీ రూ.8 కోట్ల వరకు అతడికి పెట్టింది. అసలు వేలంలో అంతకు రెట్టింపు ధర పెట్టాల్సి వచ్చింది. అతడిని తీసుకోవడం వెనక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
234 స్ట్రైక్‌రేట్‌తో కొట్టేశాడు!
ఎల్‌ఎస్‌జీ ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్‌కు ఓటేస్తుంది. జేసన్ హోల్డర్‌ను వదిలేయడంతో మిడిలార్డర్లో మంచి ఫినిషర్ కోసం ఎదురు చూస్తోంది. షినిషింగ్ లేకపోవడంతోనే కీలక మ్యాచుల్లో ఓడింది. ఈ ఏడాది నికోలస్ సూపర్ ఫామ్‌లో కనిపించాడు. టీ10 లీగులో 10 మ్యాచుల్లో 49.28 సగటు, 234.69 స్ట్రైక్‌రేట్‌తో 345 రన్స్ కొట్టాడు. 2022లో 23 టీ20లు ఆడి 29.10 సగటు, 130.49 స్ట్రైక్‌రేట్‌తో 582 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్, భారత్, బంగ్లా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఆడినవే. వన్డేల్లోనూ అదరగొట్టాడు.