KKR bought Shreyas Iyer: టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో అతడిని రూ.12.25 కోట్లకు సొంతం చేసుకుంది. పదిహేనో సీజన్లో అతడు కోల్‌కతాను నడిపించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. కెప్టెన్‌గా అతడి రికార్డు చాలా బాగుంది.
వేలంలో ఎవరెలా పోటీ పడ్డారంటే
ప్రధాన ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ పేరు రాగానే ఫ్రాంచైజీలన్నీ వెంటనే అలర్ట్ అయ్యాయి. పేరు ప్రకటించారో లేదో ఆగమేఘాలపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడి ధరను రూ.4.2 కోట్లకు తీసుకెళ్లింది. ఆ దశలోనే దిల్లీ క్యాపిటల్స్ పోటీలో ప్రవేశించింది. లక్నో సైతం రావడంతో ధర రూ.6 కోట్లకు వెళ్లింది. తెలివిగా కోల్‌కతా ఎంటరవ్వడంతో వేలం ధర పైపైకి పాకింది. రూ.9 కోట్లకు వెళ్లింది. గుజరాత్ టైటాన్స్ సైతం రూ.10 కోట్ల వరకు పాడింది. చివరికి 12.25 కోట్లతో అతడిని రెండుసార్లు ఛాంపియన్ కేకేఆర్ దక్కించుకుంది.
సత్తాగల నాయకుడు
కోల్‌కతా నైట్‌రైడర్స్ దాదాపుగా తమ కెప్టెన్‌కు దక్కించుకుందని విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే శ్రేయస్ అయ్యర్‌ను నాయకుడిగా ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేకేఆర్ వద్ద కెప్టెన్సీ అభ్యర్థులు లేరు. గతేడాది ఇయాన్ మోర్గాన్, అంతకు ముందు దినేశ్ కార్తీక్ కోల్‌కతాను నడిపించారు. అయితే వీరి వయసు పెరగడం, దూకుడుగా నడిపించడంలో పస తగ్గడంతో వారిని ఈ ఫ్రాంచైజీ వదిలేసింది. ఒక యువ నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. అతడు పరుగులు చేయడమే కాకుండా జట్టును బాగా నడిపించగలడు. దేశవాళీ క్రికెట్లో ముంబయి రంజీ జట్టుకు అయ్యర్ ట్రోఫీలు అందించాడు. ఇక దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరుగులేని రికార్డులు నెలకొల్పాడు.
రికార్డులదీ అదే మాట
శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగులో 87 మ్యాచులు ఆడాడు. 31.67 సగటుతో 2375 పరుగులు చేశాడు. 16 అర్ధశతకాలూ ఉన్నాయి. మొత్తంగా 41 మ్యాచులకు సారథ్యం వహించి 23 గెలిచాడు. 18 ఓడాడు. టాస్ విజయాల శాతం కూడా 58 శాతంగా బాగుంది. పైగా ప్లేఆఫ్స్, ఫైనల్లో సారథ్యం వహించిన అనుభవం ఉంది. ఇక మొత్తంగా 160 టీ20ల్లో అతడు 31.90 సగటు, 128 స్ట్రైక్‌రేట్‌తో 4180 పరుగులు చేశాడు. 25 అర్ధశతకాలు, 2 శతకాలూ ఉన్నాయి. వన్‌డౌన్, టూ డౌన్ నుంచి ఆఖరి వరకు ఆడగలగడం అయ్యర్ ప్రత్యేకత. వికెట్లు పడుతున్నప్పుడు నిలకడగా ఆడతాడు. సమయం రాగానే బ్యాటు ఝుళిపించడం మొదలు పెడతాడు. మైదానం బయటకూ అతడు సిక్సర్లు బాదేస్తాడు. అందుకే అన్ని విధాలా కోల్‌కతా బంగారు బాతును దక్కించుకుందనే చెప్పాలి.