IPL Mega Auction 2022: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదిహేనో సీజన్‌ వేలానికి వేళైంది! సమయం సమీపించే కొద్దీ అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండు రోజుల వేలం కావడం, స్టార్‌ ఆటగాళ్లు వేలం పరిధిలో ఉండటంతో ఆసక్తి కలుగుతోంది. ఎవరికి ఎక్కువ డబ్బు వస్తుందోననినని వారంతా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్‌లోని తొలి లాట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వారంతా రూ.2 కోట్ల కనీస ధరలో ఉన్నవారే.


రవిచంద్రన్‌ అశ్విన్‌ ఫస్ట్‌


టాటా ఐపీఎల్‌ ప్రధాన ఆటగాళ్ల జాబితాలోని మొదటి లాట్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌  (Ravichandran Ashwin) పేరు మొదట ఉందని తెలిసింది. అతడు గతంలో సీఎస్‌కే, రైజింగ్‌ పుణె, పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీకి ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌, దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ ఉన్నారు. వీరి కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది.


తొడగొట్టే గబ్బర్‌


టీమ్‌ఇండియా ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (Shikar Dhawan) ఇదే జాబితాలో ఉన్నాడు. అతడు దిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌కు గతంలో ఆడాడు. ఈ సారీ దిల్లీ అతడి కోసం పోటీపడే ఛాన్స్‌ ఉంది. తమకు ఇన్నాళ్లూ సేవలందించిన డుప్లెసిస్‌ను మళ్లీ తీసుకోవాలని చెన్నై సూపర్‌కింగ్స్‌ అనుకుంటోంది. అతడూ ఇదే జాబితాలో ఉన్నాడు.


తిరుగు లేని డేవిడ్‌ భయ్యా





ఐపీఎల్‌లో కొన్ని జట్లు నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాయి. అలాంటి వారికి శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) బెస్ట్‌ ఆప్షన్‌. అతడూ ఇదే జాబితాలో ఉన్నాడు. సఫారీ స్పీడ్‌స్టర్‌ కాగిసో  రాబాడాను మళ్లీ దిల్లీనే తీసుకొనేందుకు చూస్తోంది. టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమీకి మంచి ధరే లభించనుంది. సన్‌రైజర్స్‌ మాజీ ఆటగాడు, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) కూడా ఇదే జాబితాలో ఉన్నాడు. అతడి కోసం బెంగళూరు, దిల్లీ, పంజాబ్‌ సహా అన్ని ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. ఈ జాబితాలోని ప్రతి ఒక్కరికీ కనీసం రూ.5-15 కోట్ల మధ్య ధర పలికొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఎంత మంది ఉన్నారంటే?


దేశవిదేశాల నుంచి దాదాపుగా 600 మంది క్రికెటర్లు వేలానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 217 మందిని ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోనున్నాయి. భారత్‌ నుంచి దాదాపు 370 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 228 మంది జాతీయ జట్లకు ఆడినవారు ఉన్నారు. అలాగే అసోసియేట్‌ దేశాల నుంచి ఉన్న ఆటగాళ్లు ఏడుగురు ఉన్నారు. వేలంలో అందుబాటులో ఉన్న వారిలో 370 మంది ఆటగాళ్లు భారతీయులు కాగా, 220 మంది విదేశీయులు ఉన్నారు. ఒక్కో ఫ్రాంచైజీ మొత్తం 25 మంది క్రికెటర్లను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో గరిష్ఠంగా 8 మంది విదేశీయులు మాత్రమే ఎంచుకోవాలి. 


ఏ ధరలో ఎందరు?


వేలంలో ఆటగాళ్ల కనీస ధరలు రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షలు, రూ.75 లక్షలు, రూ.కోటి, రూ.కోటిన్నర, రూ.2 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా 48 మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.