ఐపీఎల్ 15వ సీజన్‌కు సంబంధించిన మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనుంది. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు 590 మంది ఆటగాళ్లలో తమకు నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రతి జట్టు కనీసం 18 మందికి తగ్గకుండా... 25 మందికి మించకుండా ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే కనీసం 147 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోవాల్సిందే.


ప్రతి జట్టు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసి ఉంటుంది. అయితే ప్లాన్-ఏ వర్కవుట్ అవ్వకపోతే ఏం చేయాలో కూడా ఇప్పటికే ప్లాన్ చేసి ఉంటారు. రూ.17 కోట్లతో కేఎల్ రాహుల్... ఐపీఎల్‌లో అత్యధిక మొత్తం అందుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. 2018లో విరాట్‌కు ఆర్సీబీ రూ.17 కోట్లను చెల్లించింది.


గత కొద్ది సంవత్సరాలుగా ఐపీఎల్ వేలంలో ఆల్‌రౌండర్లకే ఎక్కువ మొత్తం లభిస్తుంది. షేన్ వాట్సన్, బెన్ స్టోక్స్, క్రిస్ మోరిస్‌లు 2016 నుంచి 2021 వరకు ప్రతి వేలంలో ఎక్కువ మొత్తం దక్కించుకుని లీడ్‌లో ఉన్నారు. అన్ని ఫ్రాంచైజీలు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడంతో పాటు.. బంతితో నాలుగు ఓవర్లు కట్టడి చేసే వారికి మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో అందుబాటులో ఉన్న వారిలో టాప్ ఆల్‌రౌండర్లు వీరే..


1. వనిందు హసరంగ
ప్రస్తుతం ఐపీఎల్‌లో హాట్ ఫేవరెట్ ఆల్‌రౌండర్లలో ఈ శ్రీలంక యువ సంచలనం కూడా ఉన్నాడు. 2019లో శ్రీలంక తరఫున అరంగేట్రం చేసిన నాటి నుంచి వనిందు హసరంగ సంచలన ఆటతీరును కనపరుస్తున్నాడు. మొత్తంగా 33 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 319 పరుగులు చేసి 52 వికెట్లను తీసుకున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో హసరంగ అంచనాలకు తగ్గట్లు రాణించకపోయినా... తనకు ఈసారి కూడా మంచి మొత్తం లభించే అవకాశం ఉంది.


2. మిషెల్ మార్ష్
2021 సంవత్సరానికి గానూ... ఐసీసీ టీ20ఐ ప్లేయర్‌గా నిలిచిన మిషెల్ మార్ష్ ప్రదర్శన ఐపీఎల్‌లో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మొత్తంగా 21 మ్యాచ్‌ల్లో 225 పరుగులు చేసి... 20 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 114.21 మాత్రమే. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర ఇతనిదే. దీంతో ఈ ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తనకోసం కచ్చితంగా పోటీ పడతాయి.


3. వాషింగ్టన్ సుందర్
ఈ తమిళ ఆల్‌రౌండర్ ఇటీవలే భారత జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు గాయం కావడంతో తనకు అవకాశం దక్కింది. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు తరఫున సుందర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మొత్తం 42 మ్యాచ్‌ల్లో 217 పరుగులు చేసి 27 వికెట్లు తీసుకున్నాడు. తన ఎకానమీ రేట్ ఏడు లోపే ఉండటం విశేషం.


4. రాజ్ అంగద్ బవా
ఈ లిస్ట్‌లో ఇతను లేటెస్ట్ ఎంట్రీ. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో ఇతను ఉత్తమ పెర్ఫార్మర్. కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే 252 పరుగులు చేయడంతో పాటు.. తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. ఫైనల్లో ఐదు వికెట్లు తీసుకోవడంతో పాటు కీలకమైన 35 పరుగులు సాధించాడు. అతను భారత జట్టుకు కూడా మంచి ఆల్‌రౌండర్ ఆప్షన్


5. డ్వేన్ బ్రేవో
వినడానికి వింతగా, వయసు కొంచెం ఎక్కువ అయినా... డ్వేన్ బ్రేవో ఇప్పటికీ ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీకి అయినా మంచి ఎంపికే. టీ20 ఫార్మాట్‌లో గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకడిగా డ్వేన్ బ్రేవో ఇప్పటికే నిలిచాడు. బంతితో, బ్యాట్‌తో అతను ఇప్పటికే ఎంతో సాధించాడు. ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌ల్లో 1500కు పైగా పరుగులు, 160 వికెట్లు తన సొంతం. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరైనా డొమిస్టిక్ లీగ్‌ల్లో మాత్రం అతను కొనసాగుతున్నాడు. తనకు అంతర్జాతీయ అనుభవం కూడా ఉంది కాబట్టి... జట్టులో యువ ఆటగాళ్లకు కూడా మార్గనిర్దేశం వహించగలడు.