IPL Mega Auction 2022: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వ్యూహమేంటో అర్థమవ్వడం లేదు. ఇప్పటి వరకు ఎవరినీ తీసుకోలేదు. కనీసం పోటీ పడటం లేదు. కీలక ఆటగాళ్లలో కొందరిని ఇప్పటికే వేరే జట్లు సొంతం చేసుకోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.


ఐపీఎల్‌ వేలంలో ఇప్పటి వరకు 20 మంది ఆటగాళ్లను వేలం వేశారు. అందులో పది మంది విదేశీయులు ఉన్నారు. అంతా స్టార్‌ క్రికెటర్లే. వారిలో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, బౌలర్లు ఉన్నారు. మిడిలార్డర్‌లో అదరగొట్టే ఆటగాళ్లూ ఉన్నారు. కానీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రం ఒక్కరినీ తీసుకోలేదు. కనీసం పోటీ పడేందుకే ఆసక్తి చూపలేదు.


వేలంలో చాలాసేపటి వరకు హైదరాబాద్‌ బృందం యాక్టివ్‌గా కనిపించలేదు. మనీశ్‌ పాండే వచ్చాక మొదటి సారి బిడ్డింగ్‌ వేయడం మొదలు పెట్టారు. కానీ గతేడాది అతడు రాణించకపోవడంతో ఎక్కువ డబ్బులు వెచ్చించేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో మనీశ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌ రూ.4.60 కోట్లకు తీసుకుంది. ఆ తర్వాత డ్వేన్‌ బ్రావో కోసం బిడ్‌ వేసింది. కానీ చెన్నై దూకుడుగా బిడ్డింగ్‌ వేసింది. ఎలాగైనా దక్కించుకోవాలని ధర పెంచేసింది. దాంతో అతడినీ వదిలేసింది సన్‌రైజర్స్‌. దాంతో రూ.4.40 కోట్లకు సీఎస్‌కే తీసుకుంది.


శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌, ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ కోసం మాత్రం సన్‌రైజర్స్‌ బాగా పోటీ పడింది. మిగతా అందరితోనూ దూకుడుగా తలపడుతోంది. సన్‌రైజర్స్‌ రూ.1.80 కోట్ల వరకు బిడ్‌ వేసింది. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌ రావడంతో రూ.4 కోట్లకు ధర వెళ్లింది. ఆర్‌సీబీ కూడా ప్రవేశించడంతో ధర రూ.7 కోట్లకు పెరిగింది. మరోసారి హైదరాబాద్‌ పోటీ పడటంతో ధర రూ.10 కోట్లు దాటేసింది. అతడి ధర రూ.10.75 కోట్లకు ఆర్‌సీబీ బిడ్‌ వేయగానే ఆక్షనీరు హెడ్‌మేడస్‌ హఠాత్తుగా కుప్పకూలారు. దాంతో వేలానికి విరామం ఇచ్చారు. చూస్తుంటే ఆర్‌సీబీ అతడిని మిగతా వాళ్లకు ఇచ్చేలా లేదు. గతేడాది ఆ జట్టు తరఫున హసరంగ రాణించాడు. మరి మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ స్థానంలో అతడిని హైదరాబాద్‌ తీసుకుంటుందో లేదో చూడాలి.


వేలంలో తెలుగు ఫ్రాంచైజీ వ్యూహం పట్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌ ఆటగాళ్లలో ఎవరినీ తీసుకోకపోవడంతో మీమ్స్‌తో విమర్శిస్తున్నారు. సోషల్‌ మీడియాలో సరదా వ్యాఖ్యలు పెడుతున్నారు. స్టార్లు పక్క జట్లకు వెళ్లిపోతుంటే సన్‌రైజర్స్‌ సినిమా చూస్తోందా అంటూ పంచ్‌లు వేస్తున్నారు! ఏదేమైనా ఎవరి వ్యూహాలు వారికుంటాయి!