IPL Mega Auction 2022: ఇండియన్ ప్రీమియర్‌ లీగులో విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. శత్రువులు మిత్రులవుతారు. మిత్రులు శత్రువులవుతారు! ఐపీఎల్‌ 2022 మెగా వేలంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 'మన్కడింగ్‌' వివాదంలో క్రీడాస్ఫూర్తిపై వాదప్రతివాదాలు చేసుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin), జోస్‌ బట్లర్‌ (Jos Buttler)ఇప్పుడే ఒకే జట్టుకు ఆడనున్నారు. కలిసి ఫీల్డింగ్, బ్యాటింగ్‌ చేయబోతున్నారు. ఈ విషయం తెలియడంతో సోషల్‌ మీడియాలో మీమ్స్‌ జాతర కొనసాగుతోంది.


అశ్విన్‌, బట్లర్‌ ఇద్దరూ మంచి ఆటగాళ్లే! 2019 ఐపీఎల్‌లో చోటు చేసుకున్న వివాదంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. యాష్‌ బౌలింగ్‌ చేస్తుండగా బంతి వేయకముందే బట్లర్‌ క్రీజు దాటి చాలా దూరం వెళ్లిపోయాడు. దాంతో యాష్‌ బంతిని వికెట్లకు గిరాటేశాడు. 'మన్కడింగ్‌' చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ, ఇలాగే ప్రవర్తిస్తావా అని బట్లర్‌ వాదనకు దిగాడు. బంతి వేయకముందే సగం దూరం వెళ్తే తాను నిబంధనల ప్రకారం చేయడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశాడు. ఆ తర్వాత ఆసీస్‌, ఇంగ్లాండ్‌ సహా మిగతా క్రికెటర్లు తమకు నచ్చిన వారి తరఫున మాట్లాడారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఆడబోతున్నారు.


'వేలానికి ముందే మేం జోస్‌ బట్లర్‌తో మాట్లాడాం. మా ప్రాధాన్య ఆటగాళ్ల గురించి వివరించాం. నిజానికి అతడు దాని గురించేమీ ఆలోచించలేదు. మేమీ విషయం అతడి దృష్టికి తీసుకొచ్చాం. అందుకతడు ఫర్వాలేదన్నాడు. మైదానంలో వారిద్దరూ కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారు' అని రాజస్థాన్‌ రాయల్స్‌ సీఈవో జాక్‌ లష్‌ మెక్‌క్రమ్‌ అన్నారు. ఏదేమైన ప్రస్తుతం మీమ్స్‌ జాతర సాగుతోంది. 'హహ.. అశ్విన్‌ రాజస్థాన్‌కు వెళ్లాడు. మన్కడ్‌ చేసిన బట్లర్‌తో కలిసి ఆడటం చూసేందుకు బాగుంటుంది' అని వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ఆకాశ్‌ చోప్రా, ఇతర ఫ్రాంచైజీలు దీని గుర్తించి ప్రస్తావించాయి.