IPL Mega Auction 2022, Deepak Chahar:ఐపీఎల్‌ 2022 వేలంలో చాలా అరుదైన సీన్స్ కనిపిస్తున్నాయి. మెరికల్లాంటి క్రీడాకారులను కొనేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. ఇషాన్‌ కోసం జరిగి పోటీలో ముంబయి ఇండియన్స్‌ ముందు నిలిచింది. అతన్ని 15.25 కోట్లకు కొనుగోలు చేసింది. 


ఇషాన్ కిషన్‌ తర్వాత ఆస్థాయిలో పోటీ పడింది దీపక్‌ చాహర్ కోసం. ప్రస్తుతం అతడు చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌,  వన్డే, టీ20 ఫార్మాట్‌లలోనూ సత్తా చాటాడు. అందుకే అతడి వెంట ఐపీఎల్ ఫ్రాంచైజీలు వెంటపడ్డాయి.


దీపక్‌ చాహర్‌ ఇప్పుడు అత్యంత ఖరీదైన భారత్‌ బౌలర్‌గా మారాడు. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. IPL 2022 వేలంలో ఇప్పటి వరకు జరిగిన బిడ్డింగ్‌ దీపక్‌ టాప్‌ లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచాడు.  గత సీజన్లతో పోల్చి చూస్తే మహేంద్ర సింగ్ ధోని కంటే ఈసారి దీపక్‌ ఎక్కువ డబ్బులు సొంతం చేసుకున్నాడు. ధోనీని రూ.12 కోట్లకు తన వద్దే ఉంచుకుంది చెన్నై సూపర్‌ కింగ్స్‌. దీపక్‌కు మాత్రం రూ.14 కోట్లు చెల్లిస్తోంది. 


ఐపీఎల్ 2018లో దీపక్‌ చాహర్‌ను కేవలం రూ.80 లక్షలకే CSK కొనుక్కుంది. కానీ ఇప్పుడు మాత్రం భారీగా పెట్టుబడి పెట్టింది. IPL 2022 మెగా వేలంలో దీపక్ చాహర్‌ కోసం జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే చివరికి అతడు మళ్లీ CSK జట్టు చెంతకే చేరాడు. 


దీపక్‌ చాహర్‌ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బిడ్డింగ్ స్టార్ట్ చేశాయి. ఎలాగైనా దీపక్‌ను సొంతం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాయి. దీంతో దీపక్ చాహర్ విలువ ఒక్కసారిగా రూ.10 కోట్లు దాటింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బిడ్‌లోకి ఎంటరైంది.  సీఎస్‌కే ఎంట్రీతో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. చెన్నైతో SRH, RR పోటీ పడాల్సి వచ్చింది. చివరి వరకు చెన్నైను వెంటాడింది రాజస్థాన్‌ రాయల్స్‌ టీం. కానీ రూ.14 కోట్ల బెట్టింగ్ తర్వాత రాజస్థాన్ జట్టు వెనక్కి తగ్గింది.


దీపక్ చాహర్ ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. అతను 2018 నుంచి CSKలో ఉన్నాడు. ఇక్కడ అతనే ప్రధాన బౌలర్. 2018, 2021లో జట్టును ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు దీపక్. 


2018 తర్వాత పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతని తర్వాత ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. అయితే చాహర్ అతని కంటే 15 వికెట్ల ముందు ఉన్నాడు. 


దీపక్ చాహర్ తొలిసారి 2011లో ఐపీఎల్‌లో భాగమయ్యాడు. రూ. 10 లక్షల బేస్ ప్రైస్‌తో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. 2012 వరకు ఈ జట్టులో కొనసాగినా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు గాయం కారణంగా వెనుకబడిపోయాడు. 2016లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ తరఫున ఆడాడు. అయినా అవకాశాలు రాలేదు. దీపక్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ గమనించిన MS ధోని, స్టీఫెన్ ఫ్లెమింగ్ అతనికి అవకాశాలు ఇచ్చారు. తన డిఫరెంట్‌ బౌలింగ్‌తో వాళ్లిద్దర్నీ ఆకట్టుకున్నాడు. తర్వాత దీపక్‌ భవిష్యత్ మారిపోయింది. 2018 మెగా వేలంలో CSKలో భాగమయ్యాడు.


ఐపీఎల్‌లో ఇప్పటివరకు 63 మ్యాచ్‌లు ఆడిన దీపక్ చాహర్ 59 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 7.8,  అతని వికెట్ టేకింగ్ సగటు 29.19. లోయర్ ఆర్డర్‌లో కూడా వేగంగా పరుగులు సాధించగల సత్తా ఉన్న ఆటగాడు. భారత్ తరఫున కూడా టీ20 క్రికెట్‌లో ఆడిన దీపక్ మంచి ఆటతీరు కనబరిచాడు. 17 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు. ఏడు పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన.