IPL Mega Auction 2022, Abhinav Sadarangani: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు వేలంలో ఒక ఆటగాడు అందరినీ ఆశ్చర్యపరిచాడు! రూ.20 లక్షల కనీస ధర నుంచి రూ.2.6 కోట్ల ధర పలికాడు. అతడి కోసం మూడు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అతడే కర్ణాటకకు చెందిన అభినవ్‌ మనోహర్‌ సదరంగాని (Abhinav Sadarangani)!


ఫ్రాంచైజీల పోటీ


యువ క్రికెటర్‌ అభినవ్‌ సదరంగానిని గుజరాత్‌ టైటాన్స్‌ ఏకంగా రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ విపరీతంగా పోటీ పడ్డాయి. వరుసగా ధర పెంచుకుంటూ పోయాయి. ఈ మధ్యే జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీలో మెరుగైన ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం.


ముస్తాక్‌ అలీలో సూపర్‌


సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2021 సీజన్లో సదరంగాని  అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. నాలుగు మ్యాచుల్లో 54 సగటుతో 162 పరుగులు చేశాడు. క్వార్టర్‌ ఫైనల్లో అతడు అజేయంగా 70 పరుగులతో నిలిచి కర్ణాటకను గెలిపించడం ఫ్రాంచైజీలను ఆకట్టుకుంది. ఇదే సీజన్లో అతడు లిస్ట్‌-ఏలోనూ అరంగేట్రం చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేశాడు. బౌండరీలు, సిక్సర్లు బాదడమే కాకుండా లెగ్‌స్పిన్‌ వేయడం అతడి బలం. అందుకే ఫ్రాంచైజీలు అతడి కోసం ఎగబడ్డాయి.


Abhinav Sadaranganiతో గుజరాత్‌కు లాభమే!


సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఫైనల్లో తమిళనాడుపై సదరంగాని 37 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. అందులో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 2015లో అతడు బీజాపూర్‌ బుల్స్‌ తరఫున కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఇతడిని తీసుకోవడం గుజరాత్ టైటాన్స్‌ను మరికాస్త బలంగా మార్చిందనే చెప్పాలి! వేలంలో గుజరాత్ మరికొందరు మంచి ఆటగాళ్లను దక్కించుకుంది.