IPL Mega Auction 2022: ఇండియన్‌ ప్రీమియర్ లీగులో చెన్నై సూపర్‌కింగ్స్‌కు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమ పాత ఆటగాళ్లను తీసుకోవాలన్న కోరిక నెరవేరడం లేదు. డబ్బులు తక్కువగా ఉండటంతో చురుకైన కుర్రాళ్లను వదిలేసుకోవాల్సి వచ్చింది. కష్టపడి దీపక్‌ చాహర్‌ను (Deepak Chahar) దక్కించుకున్న ఆ జట్టు కీలకమైన శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul thakur)ను దిల్లీకి వదిలేసుకోవాల్సి వచ్చింది.


MS Dhoni మెంటార్‌షిప్‌లో ఎదిగారు


టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ మెంటార్‌షిప్‌లో దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుగా ఎదిగారు. పరిస్థితులు కలిసొచ్చినప్పుడు చాహర్‌ బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసి పవర్‌ప్లేలో వికెట్లు తీస్తుంటాడు. ప్రత్యర్థి బ్యాటర్లను వణిస్తాడు. ఐపీఎల్‌లో అతడితో మహీ ఎన్నోసార్లు మ్యాజిక్‌ చేయించాడు. ఇక శార్దూల్‌ ఠాకుర్‌ను పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. క్రికెట్లో అతడిది లక్కీ హ్యాండ్‌ అంటుంటారు. ఎందుకంటే ప్రత్యర్థి బ్యాటర్ల భాగస్వామ్యాలను విడదీయడంలో అతడు దిట్ట! ఎన్నోసార్లు అవతలి బ్యాటర్లు  క్రీజులో స్థిరపడ్డప్పుడు శార్దూల్‌ను ధోనీ ప్రయోగించి ఫలితాలు రాబట్టాడు. పైగా వీరిద్దరూ బ్యాటింగ్‌లో అదరగొడతారు. ఆఖర్లో వచ్చి సిక్సర్లు బాదేస్తారు. అందుకే వేలంలో వీరిద్దరికీ మంచి ధర లభించింది.


Deepak Chahar కోసం చెన్నై తిప్పలు!


దీపక్‌ చాహర్‌ కోసం ఫ్రాంచైజీలు విపరీతంగా పోటీ పడ్డాయి. మొదట దిల్లీ, హైదరాబాద్‌ బిడ్డింగ్‌ మొదలు పెట్టాయి. దాంతో అతడి ధర వెంటనే రూ.5 కోట్లకు చేరుకుంది. సన్‌రైజర్స్‌ మరింత దూకుడు ప్రదర్శించడంతో చాహర్‌ ధర రూ.9 కోట్లకు పెరిగింది. ఆపై రూ.10 కోట్లు కూడా వేసింది. మొత్తంగా దిల్లీ, హైదరాబాద్‌ అతడి ధరను రూ.11 కోట్ల వరకు తీసుకెళ్లారు. అప్పుడు చెన్నై సుందర రామన్‌ ఆ ధరను రూ.12 కోట్లకు తీసుకెళ్లారు. దిల్లీ, రాజస్థాన్‌ విపరీతమైన పోటీనివ్వడంతో చెన్నై ఉక్కిరి బిక్కిరి అయింది. చివరికి రూ.14 కోట్లకు అతడిని దక్కించుకోవాల్సి వచ్చింది.


Shardul thakurను కొట్టేసిన దిల్లీ


శార్దూల్‌ ఠాకూర్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డ తీరూ ఆసక్తికరంగానే అనిపించింది. పంజాబ్‌ కింగ్స్‌ అతడి కోసం బిడ్డింగ్‌ మొదలు పెట్టింది. దిల్లీ పోటీకి రావడంతో ధర రూ.4 కోట్లకు చేరుకుంది. ఈ రెండు జట్లే రూ.6 కోట్ల వరకు పోటీపడ్డాయి. ఆ తర్వాత చెన్నై బిడ్డింగ్‌ వార్‌లోకి ఎంటరైంది. కానీ పంజాబ్‌ కింగ్స్‌ ధరను అమాంతం పెంచేసింది. రూ.9 కోట్ల వరకు తీసుకెళ్లింది. చివర్లో మళ్లీ దిల్లీ క్యాపిటల్స్‌ రంగంలోకి దిగింది. రూ.10.75 కోట్లతో అతడిని దక్కించుకుంది. మిగతా వారితో పోలిస్తే చెన్నై వద్ద డబ్బు తక్కువుంది. ఇంకా కీలక ఆటగాళ్లు అవసరం. ఈ నేపథ్యంలో అతడి కోసం సీఎస్‌కే ఎక్కువ ఖర్చు చేయలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దీపక్‌ చాహర్‌ కోసం శార్దూల్‌ను త్యాగం చేసింది!


CSK కొనుగోలు చేసిన క్రికెటర్లు


చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇప్పటి వరకు వేలంలో డ్వేన్‌ బ్రావో (రూ.4.40 కోట్లు), రాబిన్‌ ఉతప్ప (రూ.2 కోట్లు), దీపక్‌ చాహర్‌ (రూ.14 కోట్లు), అంబటి రాయుడు (రూ.6.75 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఇంతకు ముందు వారు రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), ఎంఎస్‌ ధోనీ (రూ.14 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (రూ.6 కోట్లు), మొయిన్‌ అలీ (రూ.8 కోట్లు)ని అట్టిపెట్టుకున్నారు.