హైదరాబాద్: రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ఇషాన్ కిషన్ అద్భుత శతకం సాధించాడు. 45 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకోగా, ఐపీఎల్ కెరీర్ లో ఇషాన్ కిషన్ కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు చేయడంతో వంద మార్క్ చేరుకున్నాడు. దాని కంటే ముందు వరుస రెండు బంతుల్లో సిక్సర్లు బాదాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి రాజస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు సాధించి ఇషాన్ కిషన్ అజేయంగా నిలిచాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (67 పరుగులు: 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశాడు.
ఓ దశలో సన్ రైజర్స్ 300 పరుగులు చేస్తుందనిపించింది. కానీ చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్ రైజర్స్ 286 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో హయ్యెస్ట్ స్కోరు సైతం ఆరెంజ్ ఆర్మీ పేరిటే ఉంది. 287 పరుగులతో లీగ్ చరిత్రలో నెంబర్ వన్ స్కోరర్ గా SRH ఉంది. హెన్రిచ్ క్లాసెన్ (34 పరుగులు: 14 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో క్లాసెన్ ఆడిన బంతిని బౌండరీ లైన్ వద్ద రియాన్ పరాగ్ క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తుషార్ దేశ్ పాండే వరుస బంతుల్లో అనికెత్ వర్మ, అభినవ్ మనోహర్ లను ఔట్ చేశాడు. చివరి బంతికి ఇషాన్ కిషన్ ఫోర్ కొట్టాడు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3/44, మహేష్ తీక్షణ 2/52, సందీప్ శర్మకు ఓ వికెట్ దక్కింది.
మొదట్నుంచీ పరుగుల ప్రవాహమే..
పవర్ ప్లేలో కాటేరమ్మ కొడుకులు పరుగుల వరద పారించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (24: 11 బంతుల్లో 5 ఫోర్లు) కోల్పోయినా ట్రావిస్ హెడ్, వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తగ్గలేదు. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో సన్ రైజర్స్ ఒక్క వికెట్ నష్టపోయి 94 పరుగులు చేసింది. తొలి 3.4 ఓవర్లలోనే సన్ రైజర్స్ 50 పరుగుల మార్క్ దాటింది. అయితే మహేష్ తీక్షణ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ తొలి బంతికి కవర్ పాంట్ లో జైస్వాల్ క్యాచ్ పట్టడంతో అభిషేక్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు.
జోఫ్రా ఆర్చర్ వేసిన 5వ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్ తో ట్రావిస్ హెడ్ వీర విహారం చేశాడు. ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. అంతకుముందు ఫజల్ ఫరూకీ వేసిన మూడో ఓవర్లో అభిషేక్ శర్మ, హెడ్ బౌండరీలు బాది 21 పరుగులు పిండుకున్నారు. ఇషాన్ కిషన్ సైతం బ్యాట్ ఝలిపించడంతో సన్ రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. స్పిన్నర్ మహేష్ తీక్షణ 3 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా 3 ఓవర్లలో సన్ రైజర్స్ బ్యాటర్లు 54 పరుగులు చేశారు. పవర్ ప్లే ముగిసేసరికి ఓపెనర్ ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్షర్లతో 46 పరుగులు రాబట్టాడు. హెడ్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 6.4 ఓవర్లలో సన్ రైజర్స్ వంద పరుగుల మార్క్ (101 పరుగులు) దాటింది.