IPL 2025 Injured Players List: క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. జీవితంలో ఒక్కసారైనా ఈ మెగాటోర్నీలో ఆడదామని ప్రపంచంలోని అందరు క్రికెటర్లు కలలు కంటుంటారు. దీని కోసం వందల సంఖ్యలో ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకుంటారు. అయితే లక్కు మాత్రం కొందరినే వరిస్తుంది. అలా వరించిన వారికి కూడా లక్కు ఒక్కోసారి కలిసి రాదు. గాయాల బారిన పడి సీజన్ కు మిస్ అవుతుంటారు. మరి ఈరోజు అలా ఈ ఏడాది ఐపీఎల్ మిస్ అయిన వారి గురించి తెలుసుకుందామా..?
లిజాడ్ విలియమ్స్..
సౌతాఫ్రికాకు చెందిన లీజాడ్ విలియమ్స్ ఈ ఏడాది ఐపీఎల్ మిస్ కానున్నాడు. గాయం కారణంగా తను మెగాటోర్నీ నుంచి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్ రూ.75 లక్షలకు అతడిని కొనుగోలు చేయగా, ఇప్పుడు అతను దూరమయ్యాడు. అతని స్థానంలో సౌతాఫ్రికాకే చెందిన కార్బిన్ బోష్ ను ముంబై జట్టులోకి తీసుకుంది. గతంలో బోష్.. రాజస్థాన్ రాయల్స్ తరపున నెట్ బౌలర్ గా సేవలందించాడు.
బ్రైడెన్ కార్స్..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కుడి కాలి బొటనవేలి గాయానికి గురయ్యాడు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బ్రైడెన్ కార్స్. వేలంలో అతడిని రూ.1 కోటికి సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కార్స్ దూరం కావడంతో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముడ్లర్ ను జట్టులోకి తీసుకుంది. తనను రూ.75 లక్షలకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.
అల్లా ఘజన్ ఫర్..
ఆఫ్గానిస్తాన్ స్పిన్ సంచలనం ఈ సారి ఐపీఎల్ వేలంలో అనూహ్య ధర పలికాడు. రూ.4.80 కోట్లకు ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే బ్యాడ్ లక్ తో తను గాయపడ్డాడు. అతని స్థానంలో ఆఫ్గానిస్తాన్ కే చెందిన ముజీబుర్ రహ్మాన్ ను ముంబై రూ.2 కోట్లతో జట్టులోకి తీసుకుంది.
ఉమ్రాన్ మాలిక్..
ఇండియన్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ కూడా గాయం బారిన పడ్డాడు. మెగాటోర్నీకి కేవలం వారం ముంగిట తను గాయపడి, టోర్నీకి దూరమయ్యాడు. రూ.75 లక్షలతో తనను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. అయితే గాయంతో అతను అందుబాటులో లేకుండా పోవడం నిజంగా విచారించతగినదే. గత సీజన్ లో తను అంతంతమాత్రంగానే రాణించాడు. ఐపీఎల్ 2024లో కేవలం ఒక్క మ్యాచ్ సన్ రైజర్స్ తరపున ఆడాడు. అతని స్థానంలో చేతన సకారియాను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ 2025 ఈనెల 22 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది.