IPL 2025 Latest Updates: ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగు లోకి వచ్చాయి. ఈనెల 22న అధికారికంగా ఐపీఎల్ ప్రారంభమవుతోంది. డిఫెండింగ్ చాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఈ మ్యాచ్ సమయంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు కూడా జరుగుతాయి. స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్, నటి దిశా పటానీ డాన్స్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకలకు ఐసీసీ చైర్మన్ జై షా కూడా హాజరుకానున్నారు. ఈనెల 22న కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరుగుతాయి. అయితే ఈసారి ఆరంభ వేడుకలను మెగాటోర్నీ జరిగే ప్రతీ వేదికపైనా జరపాలని బీసీసీఐ భావిస్తోంది. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, కత్రీనా కైఫ్, తృప్తి డిమ్రి, అనన్య పాండే, మాధూరి దీక్షిత్, జాహ్నవీ కపూర్, తదితరులను ఈ వేడుకల్లో భాగం చేయాలని బోర్డు భావిస్తోంది.
మొత్త 14 వేదికలు..
ఐపీఎల్ ను 14 వేదికల్లో నిర్వహిస్తున్నారు. పది జట్లకు సంబంధించిన పది హోమ్ వేదికలు చెన్నై సూపర్ కింగ్స్ (చెన్నై), సన్ రైజర్స్ హైదరాబాద్ (హైదరాబాద్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ముంబై), గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్), ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ), రాజస్థాన్ రాయల్స్ (జైపూర్), పంజాబ్ కింగ్స్ (మొహాలీ), లక్నో సూపర్ జెయింట్స్ (లక్నో), కోల్ కతా నైట్ రైడర్స్ (కోల్ కతా)తోపాటు గువాహటిలో రాజస్థాన్, ధర్మశాల, ముల్లన్ పూర్లలో పంజాబ్ కింగ్స్, విశాఖపట్నంలలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోం మ్యాచ్ లు ఆడుతున్నాయి. ఈ వేదికల్లో కూడా ఐపీఎల్ ఆరంభ వేడుకలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికార వర్గాలు వెల్లడించాయి.
సహకారం ముఖ్యం..
అయితే పెద్ద యెత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఆయా రాష్ట్రాలకు చెందిన క్రికెట్ సంఘాలను ఇందులో భాగం చేయాని బోర్డు యోచిస్తోంది. మ్యాచ్ ఇన్నింగ్స్ విరామంలో ఈ వేడుకలను నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. అయితే అప్పుడు సమయం కాస్త తక్కువగా ఉంటుండటంతో జాగ్రత్తగా కార్యక్రమాలు పగడ్బందీగా చేయాలని బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఐపీఎల్ కు సంబంధించి ఇప్పటికే తమ ఆటగాళ్లతో ఆయా ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ సెషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ ఆదివారం ఒక డబుల్ హెడర్ మ్యాచ్ జరుగనుంది. సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్, అదే రోజు రాత్రి, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.