IPL 2025 KKR Vs RCB Latest Updates: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సహచరుడు త్వరలో జరిగే ఐపీఎల్లో అంపైర్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. నిజానికి 2008 అండర్-19 వన్డే ప్రపంచకప్ సాధనలో తను కీలకపాత్ర కూడా పోషించాడు. అతను మరెవరో కాదు.. తన్మయ్ శ్రీవాస్తవ. కోహ్లీతోపాటే అండర్-19 ప్రపంచకప్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్లోకి అడుగు పెట్టాడు. కింగ్స్ లెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్), డెక్కన్ చార్జర్స్, కోచీ టస్కర్స్ కేరళ తరపున ప్రాతినిథ్యం వహించాడు. అయితే మెగాటోర్నీలో విఫలం కావడంతో తను మళ్లీ ఈ వైపుకు రాలేదు. అయితే డొమెస్టిక్ క్రికెట్లో యూపీ తరపున 90 మ్యాచ్ లు ఆడి, 4900కిపైగా పరుగులు సాధించాడు. ఇక తాజాగా ఐపీఎల్లో అంపైర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తన్మయ్ అంపైర్ గా ఎంపైకైన విషయాన్ని యూపీ క్రికెట్ సంఘం అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
అంకితభావం ఉన్న ప్లేయర్..నిజమైన, అంకితభావం గల క్రికెటర్ ఫీల్డును వదలడని, ఒక మార్గం కాకుంటే మరో మార్గం ద్వారా ఆటలోనే ఉంటాడని తన్మయ్ గురించి ప్రశంసిస్తూ యూపీసీఏ ట్వీట్ చేసింది. ఇక అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో తన్మయ్ హీరోలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మ్యాచ్ లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగి 46 పరుగులు చేశాడు. దీంతో భారత్ 159 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బౌలర్లు సత్తా చాటారు. వర్షం కారణంగా కుదించిన మ్యాచ్ లో ప్రొటీస్ ను 25 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 102 పరుగులకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో 12 పరుగులతో భారత్ విజయం సాధించింది. ఆ టోర్నీలో కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీకి ఎనలేని గుర్తింపు వచ్చింది. దీంతో తను ఐపీఎల్లోకి ఆ తర్వాత భారత జట్టులోకి ఎంపికై, దిగ్గజ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు.
22 నుంచి ఐపీఎల్ షురూ..క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 మరో మూడు రోజుల్లో ప్రారంభమవనుంది. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ .. ఈనెల 22న కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనుంది. తొలి మ్యాచ్ లోనే కోహ్లీ బరిలోకి దిగనుండటం విశేషం. అలాగే అదే రోజు కోల్ కతాలోనే ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగుతాయి. అలాగే ఆ తర్వాతి రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబద్ తో , రాజస్థాన్ రాయల్స్ ఢీకొననుంది. అలాగే అదే రోజు సాయంత్రం జరిగే మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ ఆడనుంది.