BCCI New Desicion: ఆ స్పాన్సర్లను పక్కన పెట్టనున్న బీసీసీఐ.. కేంద్ర ఆదేశాలు అమలు
సిగరెట్, క్రిప్టో కరెన్సీపై బోర్డు.. స్పాన్సర్ షిప్ పై చర్చించనట్లు తెలుస్తోంది. 22 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుంది. కోల్ కతా బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో మెగాటోర్నీ ప్రారంభమవుతుంది.

IPL 2025 Latest Updates: ఐపీఎల్ ప్రారంభం మరో ఐదు రోజుల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈనెల 20న బీసీసీఐ అపెక్స్ కమిటీ సమావేశం కానుంది. కోల్ కతాలో ఈ సమావేశం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన చర్చలు జరుపుతారని సమాచారం. ముఖ్యంగా లీగ్ సందర్బంగా సిగరెట్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన స్పాన్సర్ షిప్ పై చర్చించనట్లు తెలుస్తోంది. ఈనెల 22 నుంచి అధికారికంగా ఐపీఎల్ ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్ తో మెగాటోర్నీ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లీగ్ లో వచ్చే కొన్ని యాడ్లపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిగరెట్ కన్సమ్షన్, మద్యపానం తదితర సరోగేట్ యాడ్లను ప్రసారం చేయకుండా చూడాలని బోర్డును కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించిన నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు..
ఇక ఈ ఏడాది అక్టోబర్ లో మహిళా వన్డే ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యమిస్తోంది. అయితే ఈ టోర్నీకి సంబంధించిన వేదికలు, షెడ్యూలింగ్ ను ఏర్పాటు చేసేందుకు ఆర్గనైజింగ్ కమిటీనీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈకమిటీ ద్వారా మెగా టోర్నీకి సంబంధించిన విధి విధానాల రూపకల్పన, కార్యాచరణను పూర్తి చేస్తారు. అలాగే ఈ ఏడాది వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో టీమిండియా సొంత గడ్డపై ఆడనుంది. ఆ సిరీస్ లకు సంబంధించి వేదికల నిర్ణయం కూడా చర్చకు రానుంది. అలాగే షెడ్యూలింగ్ పై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
కోహ్లీకి మద్దతు తెలిపిన కపిల్ దేవ్..
బీసీసీఐ విధించిన పది పాయింట్ల ఫార్మూలాలోని కుటుంబ సభ్యులపై ఆంక్షలను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలకు తమతోపాటు కుటుంబ సభ్యులను తీసుకెళ్తే బాగుంటుందని వ్యాఖ్యినించాడు. దీనికి లెజెండ్ కెప్టెన్ కపిల్ దేవ్ మద్దతునిచ్చాడు. ఆటగాళ్లకు అటు జట్టుతోపాటు, ఇటు ఫ్యామిలీ కూడా ముఖ్యమేనని తెలిపాడు. రెండు అంశాల మధ్య సమన్యాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. తమ రోజుల్లో అటు ఆటతోపాటు ఇటు కుటుంబానికి సమ ప్రాధాన్యం ఇచ్చేవారమని తెలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో ఆటగాళ్లపై కొన్ని ఆంక్షలను బోర్డు విధించింది. 45రోజులకుపైబడి ఉండే విదేశీ పర్యటనలో తమతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు గాను కేవలం 2 వారాల వరకు మాత్రమే సమయం ఇచ్చింది. అదే పర్యటన 45 రోజుల లోపు ఉంటే తమ వెంట కుటుంబ సభ్యులను తీసుకు వెళ్లేందుకు అనుమతిని నిరాకరించింది. అలాగే ఆటగాళ్లకు ప్రైవేట్ భద్రత, డొమెస్టిక్ క్రికెట్ ఆడటం, లగేజీ విషయంలో కఠిన నిబంధనలు, అందరూ ఒకే బస్సులో ప్రయాణించడం , తదితర విషయాలపై ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షల తర్వాత టీమ్ పనితీరు మెరుగుపడింది. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.