Team India: భారత క్రికెటర్లు విదేశాల్లో సిరీస్‌లు ఆడేందుకు వెళ్లే సమయంలో కుటుంబాలను తీసుకెళ్లే విషయంలో ఉన్న నిబంధనలను మరింత సరళతరం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పుడున్న రూల్స్ పై విరాట్ కోహ్లీ ఇటీవల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకురావాలని భావిస్తోంది. విదేశాల్లో ఆడేటప్పుడు ఆటగాళ్లు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే కుటుంబసభ్యులు కూడా ఉంటే బాగుంటుందని క్రికెటర్లు భావిస్తున్నారు. "ఆటగాళ్ళు తమ కుటుంబాలు పర్యటనలలో ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. BCCI తగిన విధంగా నిర్ణయం తీసుకుంటుంది" అని BCCI ఉన్నతాధికారి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు.
విదేశీ పర్యటనల సమయంలో పరిమితంగానే కుటుంబానికి అనుమతి
ప్రస్తుతం విదేశీ సిరీస్‌ల సమయంలో కుటుంబాలను తీసుకెళ్లడంపై ఆంక్షలు ఉన్నాయి. విదేశీ పర్యటనల సమయంలో ప్రస్తుతం వారి భాగస్వాములు, పిల్లలు రెండు వారాల వరకు గడపవచ్చు. అంత కంటే ఎక్కువ ఉండటానికి అవకాశం లేదు. అది కూడా సిరీస్ నలభై ఐదు రోజుల మించి జరిగే అవకాశం ఉంటేనే. ఈ సమయంలో కూడా వసతి సౌకర్యాన్ని మాత్రమే బీసీసీఐ భరిస్తుంది. కుటుంబ ఖర్చులన్నీ క్రికెటరే పెట్టుకోవాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనల సమయంలో బీసీసీఐ పెట్టిన నిబంధనల ప్రకారం రెండు వారాల పాటు కుటుంబాన్ని తన వెంట ఉంచకోవాలనుకుంటే ముందుగా కోచ్, కెప్టెన్ , GM ఆపరేషన్స్ అంగీకరించిన తేదీలలో మాత్రమే షెడ్యూల్ చేస్తారు. వారి ఆమోదం లేకపోతే ఆ అనుమతి కూడా ఉండదు.
కుటుంబాలు వెంట ఉంటేనే బాగుంటుందన్న కోహ్లీ ఇటీవల IPL 2025 కి సంబంధించిన ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ కుటుంబ ప్రయాణంపై ఉన్న ఆంక్షలకు వ్యతిరేకంగా గళం విప్పాడు. ఏ ఆటగాడు అయినా కుటుంబం ఎల్లప్పుడూ తన చుట్టూ ఉండాలని కోరుకుంటారని అన్నాడు. ఆట ముగిసిన తర్వాత తాను ఒంటరిగా గదికి వెళ్లి కూర్చుని విచారంగా ఉండటం తనకు ఇష్టం ఉండదన్నారు. కుటుంబం పక్కన ఉంటే..ఆటను ఒక బాధ్యతగా పరిగణించవచ్చు. మరింత మానసికంగా బలంగా ఉండవచ్చని విరాట్ కోల్హీ అభిప్రాయపడ్డారు. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యలకు మద్దతు పలికాడు. కపిల్ దేవ్ హయాంలో క్రికెటర్లతో పాటు కుటంబాలు రావడానికి ఆంక్షలు ఉండేవి కావు. ఇదే విషయాన్ని కపిల్ దేవ్ చెప్పారు.
కోహ్లీకి కపిల్ దేవ్ సపోర్టు - రూల్స్ మార్చేందుకు బీసీసీఐ రెడీ ఇటీవల దుబాయ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోపీలో భారత ఆటగాళ్లతోపాటు వారి కుటుంబాలు కూడా వచ్చాయి. విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ వంటి వారు తమ కుటుంబాలతో కలిసి చాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని ఆస్వాదించారు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో పరాజయం తర్వాత కుటుంబాలతో వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని సరిగ్గా ఆడటం లేదన్న విమర్శలు రావడంతో విదేశీ పర్యటనలలో కుటుంబాలు ఆటగాళ్లతో ఉండటానికి అనుమతించిన సమయాన్ని బీసీసీఐ పరిమితం చేసింది. ఇప్పుడు ఆ విధానాలను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.