IPL 2024 SRH vs RCB Virat Kohli Ceated New Record In Ipl History: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.
ఈ మ్యాచ్ లో . ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్ బౌలింగ్‌లో కొట్టిన సిక్సుతో కోహ్లి 251 సిక్సుల మైల్‌స్టోన్ అందుకున్నాడు. టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన మూడో ఆటగాడిగా నిలిచాడు. లిస్టులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్‌తో సమానం ఉన్నాడు. మొత్తంగా 246 మ్యాచ్‌లలో 251 సిక్సర్లు బాదాడు. డివిలియర్స్ ఇప్పటివరకు 184 మ్యాచ్‌లలో 251 సిక్సులు కొట్టాడు.
అదరగొట్టిన ఆర్సీబీ
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్ లు తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. . సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్‌లు, 1 సిక్స్ ఉన్నాయి. రజత్ పటిదార్ కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. వరుసగా వికెట్లు పడుతున్నా కామెరూన్ గ్రీన్ బెంగళూరుకు ఆపద్భాందవుడిగా మారాడు. గ్రీన్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. చివర్లో స్వప్నిల్ సింగ్ ఆరు బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్సర్లతో 12 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో నిల్చొన్న గ్రీన్ కారణంగానే బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
207 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. తొలి ఓవర్‌లోనే ట్రానిస్ హెడ్ వెనుదిరగడంతో హైదరాబాద్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఒక్క పరుగే చేసిన హెడ్...జాక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మార్‌క్రమ్ ఏడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. నితీశ్‌కుమార్ రెడ్డి 13, క్లాసెన్ ఏడు, పరుగులకు వెనుదిరగడంతో 56 పరుగులకే హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ కాసేపు బెంగళూరు బౌలర్లను అడ్డుకున్నాడు. 13 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి అవుటయ్యాడు. పాట్ కమిన్స్ కూడా 31 పరుగులే చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లు సమష్టిగా రాణించడంతో హైదరాబాద్ జట్టు 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో 35 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. 6 వరుస ఓటముల తర్వాత బెంగళూరు విక్టరీని నమోదు చేసింది. రజత్ పాటిదార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.