SRH Vs RCB IPL 2024  Royal Challengers Bengaluru won by 35 runs: ఈ ఐపీఎల్‌(IPL)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుకు(RCB)  ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. హైదరాబాద్‌(SRH)ను సొంత గడ్డపై ఓడించి బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో తొలిసారిగా బెంగళూరు బౌలర్లు ఈ మ్యాచ్‌ రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తేలిపోయింది. బెంగళూరు బౌలర్లు సమష్టిగా రాణించడంతో హైదరాబాద్ జట్టు 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో 35 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. 


 

మెరిసిన కోహ్లీ, పాటిదార్?

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు  శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలోనే 48 పరుగులు జోడించారు. విరాట్‌ కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. విరాట్‌ ధాటిగా ఆడలేకపోయాడు. కోహ్లీని ఉనద్కత్‌ అవుట్‌ చేశాడు. ఫాఫ్‌ డుప్లెసిస్‌ మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. డుప్లెసిన్‌ను నటరాజన్‌ అవుట్‌ చేశాడు. 48 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన బెంగళూరు ఆ తర్వాత కాసేపటికే మరో వికెట్‌ కోల్పోయింది. విల్‌ జాక్స్‌ ఆరు పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. రజత్‌ పాటిదార్‌ 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. పాటిదార్‌ 20 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కానీ రజత్‌ పాటిదార్‌ను కూడా ఉనద్కత్‌ పెవిలియన్‌ చేర్చాడు. లామ్రోర్‌.. నాలుగు బంతులు ఆడి ఏడు పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. భారీ అంచనాలతో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్‌ కార్తిక్‌ కూడా నిరాశపరిచాడు. ఆరు బంతుల్లో రెండు ఫోర్లతో 11 పరుగులే చేసి కమిన్స్‌ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తిక్‌ పెవిలియన్‌కు చేరాడు. వరుసగా వికెట్లు పడుతున్నా కామెరూన్‌ గ్రీన్‌ బెంగళూరుకు ఆపద్భాందవుడిగా మారాడు. గ్రీన్‌ 20 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేశాడు.  చివర్లో స్వప్నిల్‌ సింగ్‌ ఆరు బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్సర్లతో 12 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో నిల్చొన్న గ్రీన్‌.. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసి ఒక వికెట్‌ మాత్రమే తీసి 55 పరుగులు సమర్పించుకున్నాడు.  హైదరాబాద్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ మూడు వికెట్లు పడగొట్టగా, నటరాజన్‌ 2, కమిన్స్‌, మార్కండే ఒక్కో వికెట్‌ తీశారు. 

 

లక్ష్య ఛేదనలో డీలా

207 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. తొలి ఓవర్‌లోనే ట్రానిస్‌ హెడ్‌ వెనుదిరగడంతో హైదరాబాద్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఒక్క పరుగే చేసిన హెడ్‌...జాక్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మా‌ర్‌క్రమ్‌ ఏడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. నితీశ్‌కుమార్‌ రెడ్డి 13, క్లాసెన్‌ ఏడు, పరుగులకు వెనుదిరగడంతో 56 పరుగులకే హైదరాబాద్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్‌ శర్మ కాసేపు బెంగళూరు బౌలర్లను అడ్డుకున్నాడు. 13 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి అవుటయ్యాడు. పాట్‌ కమిన్స్‌ కూడా 31 పరుగులే చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లు సమష్టిగా రాణించడంతో  హైదరాబాద్ జట్టు 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో 35 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.  బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, గ్రీన్‌, కర్ణ్‌ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. విల్‌ జాక్స్‌, యశ్‌ దయాల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.