SRH vs RCB , Royal Challengers Bangalore opt to bat:  ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, బెంగళూరు(SRH vs RCB) జట్ల మధ్య మ్యాచ్‌ మారికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచి బెంగళూరు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీకిది 250వ మ్యాచ్‌. ఈ మ్యాచ్ తో 250 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా బెంగళూరు రికార్డు సృష్టించనుంది. 255 మ్యాచ్‌లు ఆడి ముంబయి మొదటి స్థానంలో ఉంది.


గత మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హైదరాబాద్‌ మరోసారి పిడుగులా విరుచుకు పడాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోనుండడంతో బెంగళూరు కూడా ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా బెంగళూరు మిణుకుమిణుకుమంటున్న ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు.  బౌలింగ్‌ వైఫల్యంతో వరుసగా విఫలమవుతున్న బెంగళూరు.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించి భీకరంగా ఉన్న హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుస పరాజయాలతో బెంగళూరు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి రెండు కీలకమైన పాయింట్లను సంపాదించాలని హైదరాబాద్ చూస్తోంది.


ఆర్సీబీ కి అన్నీ కష్టాలే 
ఆర్సీబీ అన్ని విభాగాల్లో విఫలమవుతూ కష్టాలు ఎదుర్కొంటోంది. RCB వారి గత ఐదు మ్యాచ్‌లలో కనీసం 180 పరుగులు చేసింది. అయితే సమష్టిగా రాణించలేకపోవడంతో వారికి విజయం అందని ద్రాక్షగా మారిపోయింది. బౌలర్లు విఫలమవుతున్నా బ్యాటర్లు మాత్రం పోరాడుతూనే ఉన్నారు. 222 పరుగులు చేసినా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోవడం వారిని మరింత నిర్వేదంలో కూరుకుపోయేలా చేసింది. విరాట్ కోహ్లి మాత్రం ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. 


హెడ్‌ టు హెడ్ రికార్డులు ఇలా..
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ బెంగళూరు, హైదరాబాద్‌ 24 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 13 విజయాలు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచులో ఫలితం రాలేదు.  హైదరాబాద్‌లో ఇరు జట్లు 8 మ్యాచుల్లో తలపడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు గెలవగా... బెంగళూరు రెండు గెలిచింది.


హైదరాబాద్‌ పిచ్‌ రిపోర్ట్‌
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అత్యంత అనుకూలమైనది. ఇదే పిచ్‌పై హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌పై హైదరాబాద్‌ 277 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 72 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 32 సార్లు విజయం సాధించగా, ఛేజింగ్ జట్టు 40 సార్లు విజయం సాధించింది.


ఈ ఐపీఎల్‌లో హైదరాబాద్‌ ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడి అయిదు మ్యాచుల్లో గెలిచి రెండింట్లో ఓడిపోయి 10 పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో ఉంది. బెంగళూరు ఎనిమిది మ్యాచుల్లో ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. 


హైదరాబాద్‌ తుది జట్టు 


అభిషేక్ శర్మ, ఐదెన్ మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్, నితీశ్ కుమార్‌ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్‌, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్‌ కుమార్, జయ్‌దేవ్‌ ఉనద్కత్, మయాంక్ మార్కండే, నటరాజన్‌.


బెంగళూరు తుది జట్టు 


విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్‌, రజత్‌ పటిదార్‌, కామెరూన్‌ గ్రీన్‌, దినేశ్ కార్తిక్‌, మహిపాల్ లామ్రోర్, కర్ణ్‌ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్‌ సిరాజ్, యశ్ దయాల్.