Kavya Maran Change Of Emotions After Kkr Beat Srh In Ipl 2024 Video Viral: దేశమంతా ఎదురుచూసిన ఐపీఎల్ 2024 (IPL 2024)టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది.  కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR)తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాదాపు విజయానికి సమీపంగా వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ దురదృష్టవశాత్తు విజయలాంఛనాన్ని పూర్తి చేయలేకపోయింది. చివరి బాల్ వరకు నువ్వానేనా అన్నట్లుగా ఇరుజట్లు తలపడ్డాయి. అటు  మైదానంలోని ప్రేక్షకులు,ఇటు టీవీ ముందు వీక్షకులు చివరి ఓవర్ వరకు ఊపిరి బిగబట్టుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి కేకేఆర్  విజయాన్ని అందుకుంది.  అయితే మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ హావభావాలు మరోసారి  ప్రేక్షకులను కట్టిపడేశాయి.


సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ అంటేనే జట్టు అభిమానులకు, క్రికెట్ ప్రియులకు ముందుగా కావ్య మారన్ గుర్తుకొస్తారు. ఎస్ఆర్ హెచ్ ఆడే ప్రతీ ఐపీఎల్ మ్యాచ్ లోనూ ఆమె చేసే సందడి అంతాఇంతాకాదు. జట్టు ఓటమి సమయంలోనూ, గెలిచే సమయంలోనూ ఆమె హావభావాలు ప్రతీఒక్కరిని ఆకట్టుకుంటాయి. గతేడాది ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే కెమెరాలన్నీ కావ్యమారన్ వైపు వెళ్లిపోయాయి. ఈసారి  ఎస్ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్‌తో కలిసి మ్యాచ్ చూసేందుకు వచ్చినా కెమేరాకు కన్పించకుండా జాగ్రత్త పడింది. కానీ విజయం ఖాయం  అనుకున్న క్షణంలో చిరునవ్వులు చిందిస్తూ  కెమెరాలకి కనపడిపోయింది..  కానీ పాపం ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. రెండో బంతికి క్లాసెన్ సింగిల్ తీయగా.. మూడో బంతికి షెహ్‌బాజ్ అహ్మద్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. నాలుగో బంతికి జాన్సన్ సింగిల్ తీస్తే..ఐదో బంతికి క్లాసెన్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అవడంతో మొత్తం అంతా షాక్ అయిపోయారు. కేవలం 3 బంతుల్లో సీన్ మొత్తం మారిపోయింది. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా ఒక్క పరుగు చేయలేకపోయింది ఎస్ఆర్‌హెచ్. దీంతో మ్యాచ్ పోయింది.. పాప ఆనందం ఆవిరైపోయింది.  ముఖంపై నిరాశ, విచారం స్పష్టంగా కన్పించాయి. క్షణాల్లో ఆమెలో మారిన హావ భావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  పాపం కావ్య పాప అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కావ్య పాప కోసమైనా మ్యాచ్‌లు గెలవాలని సన్‌రైజర్స్ ఆటగాళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నారు. 


ఉత్కంఠ మ్యాచ్ లో కోల్ కతా గెలుపు - పోరాడి ఓడిన హైదరాబాద్:


ఐపీఎల్‌(IPL) పదిహేడో సీజన్‌ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌(SRH) హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. కోల్‌కత్తా(KKR)తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా,.. అండ్రూ రస్సెల్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 201 పరుగులకే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసన్....  విధ్వంస ఆటతీరుతో హైదరాబాద్ ను గెలుపు సమీపానికి తీసుకువచ్చాడు...కేవలం 29 బంతుల్లో 8 భారీ సిక్సర్లతో 63 పరోగులు చేసాడు.. చివరి బంతికి అయిదు పరుగులు కావాల్సి ఉండగా డాట్ వేయడంతో హైదరాబాద్ ఓటమి ఖాయం అయింది.