Sanju Samsons unbeaten 82 powers Rajasthan Royals to 193 for 4: లక్నో(Lucknow)తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌(Rajasthan ) భారీ స్కోరు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌(Sanju Samson) 82 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా ...రియాన్ పరాగ్‌ పర్వాలేదనిపించాడు. రాజస్థాన్ మరింత భారీ స్కోరు చేస్తుందని అనిపించినా కీలక సమయంలో పరాగ్‌ అవుట్ కావడం రాజస్థాన్‌ను దెబ్బ తీసింది. కానీ చివర్లో ధ్రువ్‌ జురెల్‌ మెరుపులతో రాజస్థాన్‌ 193 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌  హక్‌ 2, మోసిన్ ఖాన్‌ 1, రవి బిష్ణోయ్‌ ఒక వికెట్‌ తీశారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన కృనాల్‌ పాండ్యా 4 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చాడు. 


 

బ్యాటింగ్‌ సాగిందిలా...

 టాస్‌ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్‌కు.. ఆదిలోనే షాక్‌ తగిలింది. మోసిన్‌ ఖాన్ వేసిన తొలి ఓవర్‌లో మూడు పరుగులే వచ్చాయి. కానీ రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు బాది టచ్‌లో కనిపించిన జోస్ బట్లర్.... ఆ ఓవర్‌లోనే అవుటయ్యాడు. నవీనుల్‌ హక్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి బట్లర్‌ అవుటయ్యాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ క్రీజులో ఉన్నంతసేపు చురుగ్గా కదిలాడు. 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సు బాది 24 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌.. నవీనుల్ హక్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. నవీన్ బౌలింగ్‌లో ఐదో బంతికి సిక్స్‌ కొట్టిన యశస్వి జైస్వాల్...  చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి కృనాల్ పాండ్యకు చిక్కాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి రాజస్థాన్‌ 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. అనతంరం సంజు శాంసన్‌, రియాన్ పరాగ్ రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 

 

శాంసన్‌-పరాగ్‌ భాగస్వామ్యం

రాజస్థాన్‌ కెప్టెన్ సంజు శాంసన్‌... రియాన్‌ పరాగ్‌ సహకారంతో స్కోర్‌ బోర్డు జోరు పెంచాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈజోడి క్రమంగా వేగం పెంచింది. యశ్‌ ఠాకూర్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో చివరి రెండు బంతులను సంజు శాంసన్‌ స్టాండ్స్‌లోకి పంపాడు. ఇదే ఓవర్‌లో రెండో బంతిని రియాన్‌ పరాగ్ కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ ఓవర్లో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అనంతరం సంజు శాంసన్ 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత సంజు దూకుడు కొనసాగించాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న రియాన్‌ పరాగ్‌ను నవీనుల్‌ హక్‌ అవుట్‌ చేశాడు. 29 బంతుల్లో 1 ఫోర్‌, మూడు సిక్సులతో 43 పరుగులు చేసి రియాన్‌ పరాగ్ వెనుదిరిగాడు.  దీంతో 142 పరుగుల వద్ద రాజస్థాన్‌ మూడో వికెట్ కోల్పోయింది. కాసేపటికే హెట్‌మయర్‌ను రవి బిష్ణోయ్ అవుట్‌ చేశాడు. రవి బిష్ణోయ్‌ వేసిన 17 ఓవర్‌లో మూడో బంతికి వికెట్ కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి... అయిదు పరుగులు చేసిన హెట్‌మెయిర్‌ అవుటయ్యాడు. చివర్లో ధ్రువ్‌ జురెల్‌ మెరుపులతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.