Rajasthan Vs Lucknow rr chose to bat : ఐపీఎల్‌(IPL)లో మరో ఆసక్తికర సమరం మొదలైంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR) జ‌ట్టుతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(LSG) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌... బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఈసారి టైటిల్‌ ఫేవరెట్లుగా ఉండడంతో ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారనుంది. కె.ఎల్‌. రాహుల్ సార‌థ్యంలోని ల‌క్నో... టైటిల్‌ వేట ఎలా ప్రారంభిస్తుందో వేచి చూడాలి. సంజూ శాంస‌న్ నేతృత్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కూడా ఈసారి కప్‌ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 


ఈ మ్యాచ్ గుర్తుందా
2022లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్-ల‌క్నో సూప‌ర్ జెయింట్స్  మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్.. ఆ సీజన్‌ కే హైలెట్‌గా నిలిచింది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన ఆ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ 6 వికెట్లు కోల్పోయి 165 ప‌రుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మేయ‌ర్ 59 ప‌రుగుల‌తో టాప్‌స్కోర‌ర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌కి అనుకూలించే పిచ్ పైన ఈ లక్ష్యం స‌రిపోదు అనుకున్నారు అంతా. కానీ య‌జువేంద్ర చాహ‌ల్ స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీసాడు. దీంతో ల‌క్నో 3 ప‌రుగుల‌తో పోరాడి ఓడిపోయింది. ఇలా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చివరి వరకు ఉత్కంఠ‌భ‌రితంగానే ఉంటుందని అభిమానులు అనుకుంటారు.


రికార్డ్ ఏంటి
ఇక ఐపీఎల్‌లో ఈ రెండు టీమ్‌ల మ‌ధ్య  3 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 2 మ్యాచ్‌లు గెల‌వ‌గా, ల‌క్నో ఒక మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ఇక ప్రస్తుత మ్యాచ్ జ‌రిగే స‌వాయ్ మాన్‌సింగ్ మైదానంలో రాజ‌స్థాన్ కి మెరుగైన రికార్డే ఉంది. ఈ మైదానంలో 52 మ్యాచ్‌లు  ఆడిన రాజ‌స్థాన్ 33 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. 19 మ్యాచ్‌ల్లో ఓట‌మి పాల‌ైంది. ఇక ల‌క్నో ఈ గ్రౌండ్‌లో ఒక్క మ్యాచ్  ఆడ‌గా అందులో విజ‌యం సాధించింది. ఈ రెండు జట్ల మ‌ధ్య జ‌రిగిన పోరులో రాజ‌స్థాన్‌, ల‌క్నో చెరో మ్యాచ్ విజ‌యం సాధించారు. ఇక ఈ మైదానంలో అత్యధిక స్కోరు 154 ప‌రుగులు కాగా, అత్యల్ప స్కోరు 144 ప‌రుగులు.


ఈ ఆట‌గాళ్ల పోరు చూడాల్సిందే
ఇక రెండు టీమ్‌ల్లో కీలక ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. ల‌క్నో విధ్వంస ఓపెన‌ర్  క్వింట‌న్ డికాక్ వ‌ర్సెస్ సందీప్ శ‌ర్మను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. సందీప్  6 ఇన్నింగ్స్‌ల్లో డికాక్‌ని 2 సార్లు ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ప‌వ‌ర్ ప్లేలో వీళ్లిద్దరి మ‌ధ్య ఆస‌క్తిక‌ర స‌మ‌రం జరగనుంది. త‌ర్వాత మిడిల్ ఆర్డర్‌లో రాబోతున్నరాహుల్ కి చాహ‌ల్, అశ్విన్ ల మ‌ధ్య పోరు ఉంటుంది. మిడిలార్డర్ లో ఇది మ‌రో ఆస‌క్తిక‌ర పోరుగా చెప్పొచ్చు. రాహుల్ స్పిన్ బౌలింగ్ ని బాగా ఆడ‌గ‌ల‌డు. కానీ వీళ్లిద్దరూ రాహుల్ కి స‌వాల్ విస‌ర‌గ‌ల‌రు. ఇక భీక‌ర ఫాంలో ఉన్న య‌శ‌స్వి జెశ్వాల్ కి మార్కస్ స్టొయిన‌స్ అడ్డుగా నిల‌బ‌డ‌బోతున్నాడు. జైశ్వాల్ ని ఇప్పటి వ‌ర‌కు 3 ఇన్నింగ్స్‌ల్లో 2 సార్లు ఔట్ చేశాడు స్టొయిన‌స్‌. ఈ ఆట‌గాళ్ల పోరు అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నుంది. అలాగే ఈ ఆట‌గాళ్ల ప్రద‌ర్శన బట్టి జ‌ట్టు విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక ఈ రెండు టీమ్‌ల మ‌ధ్య ఎక్కువ ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల లో దేవ్‌ద‌త్ ప‌డిక్కల్ 94 ప‌రుగుల‌తో టాప్‌లో ఉండ‌గా... దీప‌క్‌హుడా, మార్కస్ స్టొయిన‌స్ 86 ప‌రుగుల‌తో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే బౌల్ట్‌, ఆవేశ్‌ ఖాన్‌, చాహ‌ల్ లు 5 వికెట్లు తీసి ఎక్కువ వికెట్లు తీసిన వారిగా నిలిచారు.