KKR mentor Gautam Gambhir : ఈ ఐపీఎల్‌(IPL) సీజన్‌లో మొదటి నుంచి అద్భుతంగా రాణించిన జట్టే విజేతగా నిలిచింది. గంభీర్‌ నూరిపోసిన ఉత్తేజం ఉవ్వెత్తున ఎగిసి కోల్‌కత్తా(KKR) ఒడిలో మరో కప్పు చేరింది. గత కొన్ని సీజన్లుగా పూర్తిగా తేలిపోయిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌... ఐపీఎల్‌ టైటిల్‌ను సగర్వంగా ఒడిసిపట్టింది. తమను తిట్టిన వాళ్లకు... గేలి చేసిన వాళ్లకి... గౌతం గంభీర్‌ ఈ కప్పుతో అసలైన సమాధానం చెప్పాడు. ఇది గంభీర్‌ నడిపిన జట్టు. గంభీర్‌ రచించిన చరిత్ర. కోల్‌కత్తా జట్టు మెంటార్‌గా గౌతం గంభీర్‌ వచ్చాక ఆ జట్టు దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఆరంభం నుంచే దూకుడైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన కోల్‌కత్తా... ప్లే ఆఫ్స్‌లోనూ ప్రత్యర్థి జట్లకు ఏ మాత్రం అవకాశం లేదు. సాధికార ఆటతీరుతో కప్పును ఒడిసిపట్టింది. కోల్‌కత్తా ఈ కప్పును గెలుచుకుందంటే దానికి పూర్తి కారణం గౌతం గంభీర్‌ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.





 

అప్పుడు-ఇప్పుడు

ఐపీఎల్‌ 2012, 2014 సీజన్‌లలో గౌతం గంభీర్ సారథ్యంలోనే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ విజేతగా నిలిచింది. ఓ పక్క కెప్టెన్‌గా పక్కా వ్యూహాలు అమలు చేస్తూనే మరోపక్క కోల్‌కత్తాను ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిపాడు గంభీర్‌. కోల్‌కత్తా  ఇప్పటికి మూడుసార్లు ఐపీఎల్‌ కప్పును గెలిచింది. ఈ మూడుసార్లు కప్పు సాధించడం వెనకు గౌతం గంభీర్‌ ఉన్నాడు. రెండుసార్లు కెప్టెన్‌గా ఐపీఎల్‌ కప్పు అందించిన గౌతీ...ఈసారి మెంటార్‌గా కప్పును అందించాడు. తన పదునైన వ్యూహాలు, సమర్థవంతమైన ప్రణాళికలు, ఆటగాళ్లలో కసిని పెంచిన కప్పు దిశగా నడిపించాడు. గౌతం గంభీర్‌ జట్టులో భాగస్వామిగా లేకపోయినా ప్రతీసారి కోల్‌కత్తా దారుణ ప్రదర్శనలతో పరాభవాలను మూటగట్టుకుంది. ఈసారి జట్టును ఏకతాటిపైకి తెచ్చిన గంభీర్‌.... జట్టులోని ప్రతీ ఆటగాడిపై విశ్వాసాన్ని ఉంచాడు. ఒకటి, రెండు వైఫల్యాలకే జట్టులో చోటుకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని భరోసా కల్పించాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చాడు. గౌతీ ఇచ్చిన ఈ ధైర్యం కోల్‌కత్తా జట్టులోని యువ ఆటగాళ్లకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.

 

ఆ వ్యూహాలు అదరహో

మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ను ఎప్పుడైతే ఓపెనర్‌గా తీసుకొచ్చాడో అక్కడే కోల్‌కత్తా మెంటార్‌గా గౌతం గంభీర్‌ సగం కప్పు గెలిచేశాడు. నరైన్‌కు జోడీగా యువ సంచలనం ఫిల్‌ సాల్ట్‌ను తీసుకొచ్చి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపేలా చేశాడు. నరైన్‌ విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వెస్టిండీస్‌ ప్లేయర్‌ 488 పరుగులు చేసి సత్తా చాటాడు. మిస్టరీ స్పిన్నర్‌గా ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టే నరైన్‌... బ్యాట్‌ చేతబట్టి బౌలర్ల పని పట్టాడు. ఫిల్‌ సాల్ట్‌ కూడా ఆది నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ విధ్వంసాన్ని సృష్టించాడు. వీరిద్దరూ ఆరంభం నుంచే ఊచకోత కోయడంతో మిగిలిన బ్యాటర్ల పని సులువుగా మారిపోయింది. ఆండి రస్సెల్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు కీలక సూచనలు చేసిన గౌతీ... కెప్టెన్‌ అయ్యర్‌కు క్లిష్ట సమయంలో అండగా నిలిచి ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.