KKR Celebrations : చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL)ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను ఓడించి టైటిల్ గెలిచిన అనంతరం కోల్‌కతా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో కింగ్ ఖాన్(Shah Rukh Khan) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ తన జట్టు సభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు. తనదైన మ్యానరిజమ్స్‌తో అభిమానులను అలరించాడు. కోల్‌కత్తా జట్టులోని ప్రతీ ఆటగాడి వద్దకు వెళ్లిన బాలీవుడ్ బాద్ షా... ఐపీఎల్ టైటిల్ కలను సాకారం చేసుకున్నందుకు వారిని అభినందించాడు. ఫొటోకు ఫోజ్ ఇస్తున్నప్పుడు కూడా ఆటగాళ్లకు ప్లయింగ్ కిస్ ఎలా ఇవ్వాలో నేర్పిస్తూ షారూఖ్ సందడి చేశాడు. షారూఖ్ తనను కౌగిలించుకున్న వీడియోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కోల్‌కత్తా అన్ క్యాప్డ్ పేసర్ హర్షిత్ రానా.. ఆనందంతో ఉబ్బితబ్బిబయిపోయాడు. ఇది తన జీవితంలో మరచిపోలేని అద్భుత రోజంటూ మురిసిపోయాడు.
గంభీర్‌కు ఒక ముద్దు
కోల్‌కత్తా జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మెంటార్ గౌతం గంభీర్‌ను షారూఖ్ ఖాన్ ప్రత్యేకంగా అభినందించాడు. షారూఖ్ ఖాన్.. గౌతమ్ గంభీర్ నుదిటిపై ముద్దు పెడుతున్న ఫొటోను IPL అధికారిక పేజీలో పోస్ట్ చేసింది. ఐపీఎల్ కప్పు గెలిచిన వెంటనే తన భార్య గౌరీని కౌగిలించుకొన్న షారూఖ్ ఆమె నుదిటిపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత కుమార్తె సుహానా ఖాన్, అబ్రామ్‌ను కూడా కౌగిలించుకున్నాడు. కింగ్ ఖాన్‌తో పాటు చుట్టూ ఉన్న వారందరూ కలిసి సందడి చేశారు. షారూఖ్ మైదానంలో తిరుగుతున్నంతసేపు చెపాక్ స్టేడియం అంతా మార్మోగిపోయింది. షారుఖ్...షారుఖ్ అని అభిమానులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. రింకూసింగ్‌ను హగ్ చేసుకున్న షారుఖ్... ఈ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. గౌతం గంభీర్... సునీల్ నరైన్.. కెప్టెన్ శ్రేయస్స్ అయ్యర్ కూడా సందడి చేశాడు. గెలుపును ఆస్వాదించారు. ఆండీ రసెల్ రెండు వాటర్ బాటిళ్లను చేతులు పట్టుకుని మైదానంలో దూసుకొచ్చి ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు. మైదానంలో విజయం ఖరారు కాగానే కోల్‌కత్తా ఆటగాళ్లు మైదానంలోకి దూసుకొచ్చారు. అందరూ సంతోషంతో ఉబ్బితబ్బిబయిపోయారు.
అవార్డు సెర్మొనీ తర్వాత కూడా కేకేఆర్ సంబరాలు ఆగిపోలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేకంగా సిద్దం చేసిన ఛాంపియన్ కేక్‌ను కేకేఆర్ ప్లేయర్లు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ష్యాంపేను పొంగించారు. ట్రోఫీతో శ్రేయస్ అయ్యర్ డ్యాన్స్ చేశాడు.
ముచ్చటగా మూడోసారి
2012లో చెపాక్ మైదానంలో తొలిసారి కప్పు గెలిచిన కోల్‌కత్తా మే 26, 2024న మూడోసారి కప్పును అందుకుంది. ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా కోల్‌కతా నిలిచింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా కప్పును ముద్దాడింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ.20 కోట్ల లభించగా, రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్‌కు రూ. 12.5 కోట్లు దక్కాయి. తెలుగు కుర్రాడు..... నితీశ్ కుమార్ రెడ్డి ఈ ఇయర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు గెలుచుకున్నాడు