Chennai Super Kings: దేశంలో  IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ దశలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌ రాబోయే ఐపీఎల్‌ ఎడిషన్‌ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్‌ కారణాలతో అతడు ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడని సీఎస్కే ప్రకటించింది.  ఐపీఎల్‌ కంటే ముందు భారత్‌తో ఇంగ్లాండ్ 5 టెస్టులు ఆడనుంది. ఐపీఎల్ సీజన్‌ ముగిసిన అనంతరం టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే అతడు ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉంటున్నట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేర్కొంది. ఐపీఎల్‌కు ముందు భార‌త్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆ త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఉంది. ఐపీఎల్ ఆడితే ఆ సిరీస్‌లో వ‌ర్క్‌లోడ్ ప‌డుతుంద‌ని స్టోక్స్ భావిస్తే అత‌డికి మేము స‌హక‌రిస్తామి చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేర్కొంది.


వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు నుంచి స్టోక్స్ మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. మెగా టోర్నీ త‌ర్వాత స్వదేశంలో స‌ర్జరీ చేయించుకుంటాన‌ని స్టోక్స్‌ ఇప్పటికే వెల్లడించాడు. జ‌న‌వ‌రి చివ‌రి వారంలో స్టోక్స్ స‌ర్జరీ చేయించుకోనున్నాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్ ప్రారంభ‌మ‌య్యే స‌మయానికి అత‌డు కోలుకుంటాడు. అయితే.. ఆలోపు ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేదా? అనేది తెలియదు. దానికి తోడూ ఐపీఎల్‌లో శారీరంపై ఒత్తిడి ప‌డే అవ‌కాశం ఉంది. అందుక‌నే స్టోక్స్ వ‌చ్చే సీజ‌న్‌లో ఆడ‌కూడ‌ద‌నే నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.


ఐపీఎల్‌కు వచ్చిన బెన్ స్టోక్స్‌ను గత వేలంలో చెన్నై ఫ్రాంచైజీ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, స్టోక్స్ తనకు వచ్చిన డబ్బుకు న్యాయం చేయలేకపోయాడు. వచ్చే నెలలో యూఏఈలో జరిగే షార్ట్ వేలానికి ముందు స్టోక్స్‌ను జట్టు నుంచి తప్పించేస్తారని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు స్టోక్స్ స్వయంగా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. బెన్ స్టోక్స్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 45 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 2 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలతో సహా 935 పరుగులు చేశాడు. 28 వికెట్లు కూడా తీశాడు.


2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను స్టోక్స్‌ ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ మెగా టోర్నమెంట్‌లో ఆల్‌రౌండర్‌గా స్టోక్స్‌ ప్రధాన భూమిక పోషించాడు. ఆ టోర్నీలో 11 మ్యాచ్‌ల్లో 66.42 సగటుతో 465 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లూ పడగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో అతని ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. న్యూజిలాండ్‌తో ఛేదనలో స్టోక్స్‌ 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను టై చేసి జట్టును గట్టెక్కించాడు. సూపర్‌ ఓవర్లోనూ రాణించాడు. అది కూడా టై కావడంతో బౌండరీల సంఖ్యతో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. స్టోక్స్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 


మరోవైపు ఐపీఎల్‌ 2024 సీజన్‌ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. డిసెంబరు 19న ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. అయితే, ఈ సారి భారత్‌ కాకుండా వేరే దేశంలో వేలం నిర్వహిస్తారని తెలుస్తోంది. దుబాయ్‌ వేదికగా ఆటగాళ్ల వేలం ఉంటుందని సమాచారం. రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 లోగా అందజేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఆ లోగా జట్లు ఆటగాళ్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply