Indian Premier League:  అలా వన్డే ప్రపంచకప్‌(World Cup) ముగిసిందో లేదో ఇలా దేశంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) సందడి మొదలైంది. రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసేందుకు సమయం ఆసన్నమవుతుండటంతో ఫ్రాంఛైజీలు అప్రమత్తమయ్యాయి. ప్లేయర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తమ ఆటగాళ్లను వేరే జట్లకు పంపించి.. ఆ జట్టు ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకుంటున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌(Rajasthan Royals (RR)), లక్నో సూపర్‌జెయింట్స్‌(Lucknow Super Giants (LSG)) తమ ప్లేయర్లను పరస్పరం బదిలీ చేసుకున్నాయి. ఇందులో భాగంగా రాజస్థాన్‌ నుంచి దేవదత్‌ పడిక్కల్‌(Devdutt Padikkal ) లక్నోకు.. మరోవైపు లక్నో స్పీడ్‌స్టర్‌ అవేశ్‌ఖాన్‌(Avesh Khan).. రాజస్థాన్‌కు మారారు. 

 

రాజస్థాన్ రాయల్స్ జట్టు దేవ్ దత్ పడిక్కల్‌ను వదిలేసింది. అతడి స్థానంలో లక్నో జట్టు పేసర్ ఆవేశ్ ఖాన్‌ను సొంతం చేసుకుంది. ఇరు జట్ల పరస్పర అంగీకారంతో ఈ ట్రేడింగ్ జరిపాయి. ఇందుకు సంబంధించి రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రకటన విడుదల చేసింది. గత వేలంలో లక్నో సూపర్ జాయింట్స్ జట్టు ఆవేశ్ ఖాన్‌ను రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో రాజస్థాన్ రాయల్స్.. దేవదత్ పడిక్కల్‌ను రూ.7.75 కోట్లకు తీసుకుంది. ఇప్పుడు అదే ధరకు ఇరు జట్లు కూడా ఆటగాళ్లను మార్చుకున్నాయి. యువ పేసర్‌ అవేశ్‌ఖాన్‌.. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 47 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌..57 మ్యాచ్‌ల్లో 1,521 పరుగులు చేశాడు. 

 

IPL 2024 కోసం ఫ్రాంచైజీలు నవంబర్‌ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు వదులుకోబోయే ఆటగాళ్ల  వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల ఎంపికపై దృష్టి సారించాయి. ఇక అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా మరో మూడు రోజుల్లో వెలువడనుంది. 

 

మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ IPLలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టుతో రెండేళ్ల అనుబంధాన్ని తెంచుకున్నాడు. ల‌క్నో జ‌ట్టుకు రెండేళ్ల నుంచి గంభీర్ మెంట‌ర్‌గా ఉంటున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌ పదవికి రాజీనామా చేసిన గంభీర్.. తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్‌‍తో తిరిగి చేరాడు. ఈ విషయాన్ని గంభీర్ అధికారికంగా ప్రకటించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌‍కు కొన్నాళ్లు నాయకత్వం వహించిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో జట్టును IPL ఛాంపియన్‌గా నిలిపాడు. కొన్నాళ్లపాటు అదే జట్టుకు మెంటార్‌గా పనిచేశాడు. రెండేళ్ల కిందట KKRని వదిలి కొత్తగా వచ్చిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు మెంటర్‌గా నియమితుడయ్యాడు. ఇప్పుడు తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. గంభీర్‌ మార్గనిర్దేశంలో లక్నో 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

 

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నట్లు గంభీర్‌ ప్రక‌టించడాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్‌‍ ఓన‌ర్ షారుక్ ఖాన్ స్వాగ‌తించారు. గౌతం గంభీర్ ఎప్పటికీ తమ కుటుంబంలో ఒకడన్న షారూక్.. తమ కెప్టెన్ మరో అవతారంలో తమతో చేరుతున్నాడంటూ ట్వీట్ చేశాడు. హెడ్ కోచ్ చంద్రకాంత్‌తో కలిసి గౌతీ అద్భుతాలు సృష్టిస్తాడని షారూఖ్‌ ఖాన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ వ్యవహరిస్తున్నారు, అభిషేక్ నాయర్ ఆసిస్టెంట్ కోచ్‌గా, భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు.