India new head coach: భారత్‌(Bharat) వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World Cup) ముగియడంతో కోచ్‌గా ది వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌(Rahul Drevid) పదవీకాలం కూడా అధికారికంగా ముగిసింది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌(BCCI) ఒప్పందం ప్రకారం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో రాహుల్ ద్రవిడ్‌ పదవీ కాలం పూర్తయింది. రాహుల్‌ ద్రావిడ్‌ రెండేళ్ల పాటు టీమిండియాకు కోచ్‌గా ఉన్నాడు. ఈ రెండేళ్ల కాలంలో ఐసీసీ నిర్వహించిన టోర్నమెంట్‌లలో రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు టీమిండియాను ది వాల్‌ తీసుకెళ్లాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిపాడు.  2021లో భారతజట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు రాహుల్ ద్రావిడ్. మరోసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే ద్రావిడ్‌ టీమిండియా కోచ్‌గా కొనసాగడానికి ఆసక్తి చూపకపోతే కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ చేపట్టాల్సి ఉంటుంది. అయితే ద్రావిడ్‌ స్థానంలో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్ల పేర్లు భారత జట్టు కోచ్‌ రేసులో వినిపిస్తు‌న్నాయి. ద్రావిడ్‌ కోచ్‌ బాధ్యతలు స్వీకరించకపోతే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 

 

వీవీఎస్‌ లక్ష్మణ్‌

 

రాహుల్‌ ద్రావిడ్‌ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించకపోతే ఆ బాధ్యతలు వెరీ వెరీ స్పెషల్‌ లక్ష్మణ్‌(VVS Laxman) స్వీకరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌కు మాత్రం వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.  చాలా సిరీస్‌లకు లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గానూ వ్యవహరించారు. లక్ష్మణ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ద్రావిడ్ కూడా NCA చీఫ్ పదవి నుంచే హెడ్‌ కోచ్‌గా వచ్చాడు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ను కూడా అలాగే ప్రమోట్ చేస్తారనే కథనాలు వెలువడుతున్నాయి. రాహుల్ ద్రావిడ్‌ను పొడిగించకపోతే ఆ ప్లేసులోకి లక్ష్మణ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

అనిల్‌ కుంబ్లే

టీమిండియా కోచ్‌గా బలంగా వినిపిస్తున్న మరో పేరు దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేది(Anil Kumble). క్రికెటర్‌గా, కెప్టెన్‌గా కుంబ్లేకు అపారమైన అనుభవం ఉంది. గతంలో కోచ్‌గానూ అనిల్‌ బాయ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. విరాట్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కుంబ్లే కోచ్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో టీమిండియా విజయాల శాతం కూడా ఎక్కువగానే ఉంది. కుంబ్లే, విరాట్ కోహ్లి కాంబినేషన్‌లో టీమిండియా టెస్టుల్లో అనేక విజయాలు సాధించింది. కుంబ్లే కోచింగ్‌లోనే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కోచ్‌గా కుంబ్లే తప్పుకున్న తర్వాత రవిశాస్త్రి టీమిండియా కోచ్‌గా వచ్చారు. అయితే కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో విరాట్‌కు, కుంబ్లేకు పడలేదన్న వార్తలు వచ్చాయి.

 

వీరేంద్ర సెహ్వాగ్‌

భారత జట్టు కోచ్‌ రేసులో వినిపిస్తున్న మరో ప్రముఖ పేరు డాషింగ్‌ ఓపెనర్‌, విధ్వంసకర బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ది(Virender Sehwag). సెహ్వాగ్‌ పేరు టీమిండియా కోచ్‌ పదవికి పరిశీలిస్తున్నారన్న వార్త ఈ విధ్వంసకర బ్యాటర్‌ అభిమానులకు కిక్‌ ఇచ్చింది. ఐపీఎల్‌లో ఏ జట్టుతోనూ వీరేంద్ర సెహ్వాగ్ కలిసి పనిచేయడం లేదు. సౌతాఫ్రికాతో సిరీస్ నుంచి సెహ్వాగ్ కోచ్‌గా రావచ్చనే వార్తలు వస్తున్నాయి. 2017లోనే టీమిండియా కోచ్ పదవికి సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. ద్రావిడ్‌ను కొనసాగించని పక్షంలో ఈ ముగ్గురిలో ఒకరు టీమిండియా కోచ్‌గా రావచ్చనే ప్రచారం జరుగుతోంది.