లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత పడింది. సీజన్ కు 14 గేమ్స్ ఆడేందుకు కోహ్లీకి ఆర్సీబీ చెల్లిస్తున్న మొత్తం 15 కోట్లు. ఆ లెక్కన ఒక్క మ్యాచ్ ఫీజు... కోటీ 7 లక్షల రూపాయలు. ఆ మొత్తాన్నే విరాట్ కు ఫైన్ విధించారు.


అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్లినా, అక్కడ ఇంకో 2-3 మ్యాచెస్ ఆడితే... అప్పుడు ఈ మ్యాచ్ ఫీజు మళ్లీ మారుతుంది. అంటే ఇప్పుడు ఉన్న కోటీ 7 లక్షల రూపాయల నుంచి కాస్త తగ్గుతుంది. కానీ నిజంగా విరాట్ కోహ్లీకి కోటి రూపాయల నష్టం కలిగిందా...? ఆ డబ్బు అతనే ఫైన్ గా చెల్లించాల్సిందేనా..? కానే కాదు.


ఆర్సీబీకి చెందిన ఓ అధికారి ప్రముఖ క్రికెటింగ్ వెబ్ సైట్ క్రిక్ బజ్ కు... ఓ ఇంట్రెస్టింగ్ సమాచారం ఇచ్చారు. ఆటగాళ్లు జట్టు కోసం గ్రౌండ్ లో తమ ఎఫోర్ట్ అంతా పెడతారని, దాన్ని మేం చాలా గౌరవిస్తామని, తమ టీమ్ కల్చర్ లో భాగంగా.... ఇలాంటి ఫైన్స్ ను ఆటగాళ్ల సాలరీస్ లో నుంచి కట్ చేయబోమని ఆ అధికారి క్రిక్ బజ్ కు చెప్పారు. ఆ అమౌంట్ ను ఆర్సీబీ ఫ్రాంచైజీయే భరిస్తుందన్నమాట.


అసలు ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్స్ కు కానీ, ఇలా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలకు సంబంధించి పడిన ఫైన్స్ ను తెలుపుతూ.... సీజన్ అంతా అయ్యాక బీసీసీఐ ఫ్రాంచైజీలకు ఇన్వాయిస్ లు పంపుతుంది. ఆ అమౌంట్ ను ఫ్రాంచైజీలే భరిస్తాయా లేకపోతే ఏ ఆటగాడికి ఆ ఆటగాడు చెల్లిస్తాడా అనేది ఆయా ఫ్రాంచైజీల విధానాల మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి బోర్డుతో ఎలాంటి సంబంధం లేదు. ఫైన్ మాత్రం కచ్చితంగా బోర్డుకు అందాల్సిందే.


ఇదీ జరిగింది.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడు


లక్నో - బెంగళూరు మధ్య  రెండ్రోజుల క్రితం  లక్నో వేదికగా ముగిసిన మ్యాచ్‌లో గంభీర్ - కోహ్లీలు మరోసారి తమ పాత పగలకు కొత్త టచ్ ఇస్తూ  చేసుకున్న  అగ్లీ ఫైట్  ఐపీఎల్‌లో మరో మాయని మచ్చగా మిగిలింది.  ఇంతకీ అసలు అక్కడ వీళ్లిద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైంది..?  దీనిపై లక్నో టీమ్ డగౌట్ లో  ఉన్న ఓ వ్యక్తి.. తాజాగా పీటీఐతో సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు అతడు అక్కడే ప్రత్యక్ష సాక్షిగా (పేరు వెల్లడించలేదు) ఉన్నాడు. 


ఈ వివాదం గురించి ఆ వ్యక్తి పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఏం జరిగిందో మీరు టీవీలలో చూశారు. మ్యాచ్ ముగియగానే కైల్ మేయర్స్.. కోహ్లీ మాట్లాడుకుంటున్నారు. కోహ్లీతో   మేయర్స్.. ‘నువ్వెందుకు పదే పదే  మమ్మల్ని అబ్యూజ్ (దుర్భాషలాడటం)  చేస్తున్నావ్’ అని ప్రశ్నించాడు.  అప్పుడు కోహ్లీ.. ‘మరి మీరెందుకు నా వైపు అంత కోపంగా చూస్తున్నారు..?’అని ఎదురుప్రశ్న వేశాడు.. 


ఇది జరుగుతుండగానే అక్కడకు గంభీర్ వచ్చి మేయర్స్ ను పక్కకు తీసుకుపోతూ విరాట్‌తో ‘నువ్వు అతడికి ఏం చెప్తున్నావ్?’ అని అడిగాడు.  దానికి విరాట్  ‘అసలు మేం మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలోకి ఎందుకొచ్చావ్..?’ అని గుస్సా అయ్యాడు.  దాంతో గౌతమ్.. ‘నువ్వు నా  ప్లేయర్స్‌ను  నిందిస్తున్నావ్.  నా ప్లేయర్స్ అంటే నా  ఫ్యామిలీ. నువ్వు వాళ్లను తిడితే నా ఫ్యామిలీని తిట్టినట్టే..’అని  చెప్పాడు..