PBKS vs MI, IPL 2023:
ముంబయి ఇండియన్స్ జూలు విదిల్చింది! తాము బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించింది! మొహాలి స్టేడియాన్ని హోరెత్తించింది. పంజాబ్ కింగ్స్ సెట్ చేసిన 215 పరుగుల బిగ్ టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఛేజ్ చేసింది. మరో 7 బంతులు మిగిలుండగానే.. 6 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఇషాన్ కిషన్ (75; 41 బంతుల్లో 7x4, 3x6) సిక్సర్ల మోత మోగించాడు. సూర్యకుమార్ యాదవ్ (66; 31 బంతుల్లో 8x4, 2x6) 360 డిగ్రీ ఇన్నింగ్స్ ఆడేశాడు. అంతకు ముందు కింగ్స్‌లో లియామ్ లివింగ్ స్టోన్ (82; 42 బంతుల్లో 7x4, 4x6) రెచ్చిపోయాడు. సిక్సర్ల మోత మోగించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (49; 27 బంతుల్లో 5x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు.
దంచిన.. కిషన్, సూర్య
బిగ్ ఛేజ్‌లో ముంబయికి గుడ్ స్టార్ట్ రాలేదు. ఇన్నింగ్స్ మూడో బంతికే పరుగుల ఖాతా తెరవకముందే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. రిషి ధావన్ బౌలింగ్‌లో షార్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ (23), కిషన్ కలిసి రెండో వికెట్‌కు 33 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం అందించారు. పవర్ ప్లే ముగిసే సరికి ముంబయిని 54/2తో నిలిపారు. ఆరో ఓవర్ ఆఖరి బంతికి గ్రీన్‌ను ఎలిస్ ఔట్ చేశాడు. ఆ తర్వాతే అసలు సిసలు ఊచకోత మొదలైంది. ఒకవైపు సూర్య, మరోవైపు కిషన్.. ఆకలిగొన్న పులుల్లా చెలరేగారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను వేటాడారు. మూడో వికెట్‌కు 55 బంతుల్లోనే 116 పరుగుల పాట్నర్‌షిప్ నెలకొల్పారు. వీరిద్దరూ కొట్టిన సిక్సర్లు, బౌండరీలకు మొహాలి మోత మోగిపోయింది. కిషన్ 29, సూర్య 23 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించారు. 14.1 ఓవర్లకే స్కోరును 150కి చేర్చారు. వీరిద్దరూ ఆరు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో పంజాబ్ గేమ్‌లోకి వస్తుందేమో.. హిట్‌మ్యాన్ సేన ఇబ్బంది పడుతుందేమో అనిపించింది. అయితే టిమ్ డేవిడ్ (19*), తిలక్ వర్మ (26*) గేమ్‌ను ఫినిష్ చేశారు.
అగ్రెసివ్ పంజాబ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 13 వద్దే ప్రభుసిమ్రన్ సింగ్ (9)ను అర్షద్ ఖాన్ ఔట్ చేశాడు. మాథ్యూ షార్ట్ (27), శిఖర్ ధావన్ (30) ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 50/1తో నిలిచింది. రెండో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని.. ధావన్‌ను ఔట్ చేయడం ద్వారా పియూష్ చావ్లా విడదీశాడు. ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేశాడు. అప్పటికి స్కోరు 62. ఈ సిచ్యువేషన్లో బరిలోకి దిగిన లియామ్ లివింగ్‌స్టోన్ మొదట్నుంచీ అగ్రెసివ్ ఇంటెంట్‌తో కనిపించాడు. షార్ట్‌తో కలిసి 25 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 12వ ఓవర్లో షార్ట్‌ను చావ్లానే పెవిలియన్‌కు పంపించాడు.
జిత్తూ, లివింగ్‌స్టన్ అదుర్స్
వికెట్లు పడ్డప్పటికీ అగ్రెసివ్ బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ 15.2 ఓవర్లకే 150కి చేరుకుంది. అప్పట్నుంచి ఊచకోత మరింత మొదలైంది. రావడం రావడంతోనే జితేశ్ శర్మ ముంబయి బౌలర్లను ఉతికారేశాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు కొట్టాడు. 18.5 ఓవర్లకే స్కోరును 200 దాటించాడు. మరోవైపు లివింగ్‌స్టోన్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. ఆ తర్వాత భీకరమైన షాట్లు ఆడేశాడు. వీరిద్దరూ 53 బంతుల్లోనే 119 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించడంతో పంజాబ్ 214/3కు చేరుకుంది.