Mohammed Siraj New House:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్‌ను సర్‌ప్రైజ్ చేశారు! హైదరాబాద్‌లో అతడు కొత్తగా నిర్మించుకున్న ఇంటిని సందర్శించారు. కొన్ని గంటల పాటు అక్కడే గడిపారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా సరదాగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బుధవారం తన చివరి రెండో లీగ్ మ్యాచును ఆడనుంది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే నగరానికి వచ్చేసింది. పనిలో పనిగా లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ఇంటికి వచ్చేసింది.
జూబ్లీ హిల్స్ ఫిల్మ్‌నగర్లో మహ్మద్ సిరాజ్ కుటుంబం ఈ మధ్యే కొత్త ఇంటిని నిర్మించుకుంది. గతంలో వారు పాతబస్తీలో ఉండేవారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీమ్‌ఇండియాకు ఆడుతుండటంతో సిరాజ్ రాత మారింది. సంపాదన పెరిగింది. దాంతో కుటుంబం కోసం కొత్త ఇల్లు కట్టించాడు.
సిరాజ్ కొత్తింట్లో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, కేదార్ జాదవ్, వేన్ పర్నెల్ సరదాగా గడిపారు. ఇతర క్రికెటర్లూ ఇంటిని వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ అభిమాని ట్విటర్లో పంచుకున్నాడు. దాంతో వైరల్‌గా మారింది.
ఈ సీజన్లో మహ్మద్ సిరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆరంభం నుంచీ అదరగొడుతున్నాడు. పవర్‌ప్లేలో కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బాడీలైన్, టైట్ లెంగ్తుల్లో బంతులేస్తున్నాడు. ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. పవర్ ప్లే ముగిసే సరికే ఒకట్రెండు వికెట్లు పడగొడుతున్నాడు. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన అతడు 16 వికెట్లు పడగొట్టాడు. 42 ఓవర్లు వేసి 327 పరుగులు ఇచ్చాడు. 7.78 ఎకానమీతో దుమ్మురేపుతున్నాడు. ప్రతి 16 బంతులకు ఒక వికెట్ చొప్పున పడగొడుతున్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
Also Read: గిల్ ఆన్ డ్యూటీ - లేనే లేదు పోటీ - ఫార్మాట్ ఏదైనా సెంచరీలు చేయడంలో మేటి
ఆర్సీబీ ఈ సీజన్లో ప్లేఆఫ్ చేరుకోవడం చాలా కష్టం! ప్రస్తుతం 6 విజయాలు 6 ఓటములతో ఐదో స్థానంలో ఉంది. 12 పాయింట్లు, 0.166 రన్‌రేట్‌తో నిలిచింది. ఇంకో రెండు మ్యాచులు ఉన్నాయి. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ రెండింట్లో కచ్చితంగా గెలిస్తే ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అదీ ఇతర జట్లు ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ నేడు జరిగే మ్యాచులో ముంబయిపై లక్నో సూపర్ జెయింట్స్ గెలిస్తే ఆర్సీబీ పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. అంటే ప్రతి మ్యాచూ డుప్లెసిస్ సేనకు నాకౌట్‌గానే మారుతుంది.