Shubman Gill: భారత క్రికెట్ జట్టుకు గత దశాబ్దంన్నర కాలంగా బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వారి కెరీర్ చరమాంకంలోకి వచ్చారు. మరి వీరిని భర్తీ చేసే ఆటగాడు ఎవరు..? అన్న ప్రశ్నలకు సమాధానంగా నేనున్నానంటూ దూసుకొస్తున్నాడు యువ సంచలనం శుబ్‌మన్ గిల్. ఈ పంజాబ్ సంచలనం ఫార్మాట్ ఏదైనా మంచినీళ్లు తాగిన ప్రాయంగా సెంచరీలు బాదుతున్నాడు. గతేడాది నుంచి నిలకడగా రాణిస్తున్న గిల్.. తాజాగా ఐపీఎల్‌లో కూడా మూడంకెల స్కోరు ముచ్చట తీర్చుకున్నాడు.
గతేడాది నుంచే ఫుల్ స్వింగ్..
2019 నుంచే భారత జట్టుతో ఉన్న గిల్ గతేడాది నుంచి నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్ నేతృత్వంలోని ప్రధాన భారత జట్టుతో పాటు ధావన్ సారథ్యంలోని మరో జట్టు గతేడాది వివిధ దేశాలతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడింది. వన్డేలలో గిల్ నిలకడగా రాణించడంతో అతడిని మెయిన్ టీమ్‌కు ప్రమోట్ చేయడమే గాక రోహిత్‌కు జోడీగా ఓపెనర్ గా పంపింది టీమిండియా. ఈ ఏడాది నుంచి అతడు పట్టిందల్లా బంగారమే అవుతోంది.
బంగ్లాతో మొదలు..
గతేడాది డిసెంబర్ లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడానికి ముందు గిల్‌కు ఈ ఫార్మాట్ లో సెంచరీ లేదు. కానీ బంగ్లా సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ హండ్రెడ్ కొట్టిన గిల్.. ఈ ఏడాది జనవరిలో భారత్ - శ్రీలంక మధ్య జరిగిన వన్డే సిరీస్ లో ఓపెనర్ గా వచ్చి సెంచరీ కొట్టాడు. వన్డేలలో గిల్‌కు అది రెండో (2022 ఆగస్టులో జింబాబ్వేపై ఫస్ట్ హండ్రెడ్) శతకం. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో డబుల్ సెంచరీ, ఇండోర్ లో మరో సెంచరీ చేశాడు. కివీస్‌తో టీ20 సిరీస్ లో కూడా గిల్ మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు. ఇక ఇటీవలే ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా అహ్మదాబాద్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో గిల్ శతకం చేసిన విషయం తెలిసిందే.
ఐపీఎల్‌లో..
మూడు ఫార్మాట్ లలో సెంచరీలు చేసినా గిల్ కు ఐపీఎల్ లో సెంచరీ లేని లోటు వెంటాడింది. సన్ రైజర్స్ తో సెంచరీకి ముందు గిల్ రెండు సార్లు 90 లలోకి వచ్చినా శతకం చేయలేదు. ఆఖరికి ఇదే అహ్మదాబాద్ వేదికగాపై లక్నోతో ఆడిన గత మ్యాచ్ లో కూడా 94 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. కానీ హైదరాబాద్‌తో మాత్రం ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు. తద్వారా ఈ ఏడాది అన్ని ఫార్మట్లతో పాటు ఐపీఎల్‌లో కూడా సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
గిల్ ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తో పాటు అక్టోబర్ లో జరుగబోయే వన్దే వరల్డ్ కప్ లలో భారత్‌కు తిరుగుండదు.