IPL 2023 Latest Points Table: ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లతో ఉంది. ఇది కాకుండా ఈ జట్టు నెట్ రన్ రేట్ +0.835గా ఉంది. పాయింట్ల పట్టికలో హార్దిక్ పాండ్యా జట్టు అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు సాధించింది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్ 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఈ విధంగా టాప్-4లో గుజరాత్ టైటాన్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఫాఫ్ డు ప్లెసిస్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది.
ఇది కాకుండా రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలోనూ, కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడో స్థానంలోనూ ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలో 12 పాయింట్లతో ఉన్నాయి. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 12 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 పరుగులతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (101: 58 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో గిల్‌కు ఇదే మొదటి సెంచరీ. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (64: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (27: 26 బంతుల్లో, మూడు ఫోర్లు), మయాంక్ మార్కండే (18: 9 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కొంచెం ప్రయత్నించారు. మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా దారుణంగా విఫలం అయింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీకి నాలుగు వికెట్లు దక్కాయి.