Sunrisers Hyderabad vs Gujarat Titans: సన్‌రైజర్స్ హైదరాబాద్ వరస్ట్ సీజన్లలో ఒకటిగా 2023 నిలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రైజర్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వకుండా ఇంటి బాట పట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 34 పరుగులతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (101: 58 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో గిల్‌కు ఇదే మొదటి సెంచరీ. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (64: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (27: 26 బంతుల్లో, మూడు ఫోర్లు), మయాంక్ మార్కండే (18: 9 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కొంచెం ప్రయత్నించారు. మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా దారుణంగా విఫలం అయింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీకి నాలుగు వికెట్లు దక్కాయి.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ప్రారంభంలో వరుసగా విఫలం అయింది. ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్ సింగ్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్), అభిషేక్ శర్మ (4: 5 బంతుల్లో, ఒక ఫోర్) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. ఎయిడెన్ మార్క్రమ్ (10: 10 బంతుల్లో, ఒక ఫోర్), రాహుల్ త్రిపాఠి (1: 2 బంతుల్లో), సన్వీర్ సింగ్ (7: 6 బంతుల్లో, ఒక సిక్సర్), అబ్దుల్ సమద్ (4: 3 బంతుల్లో, ఒక ఫోర్), మార్కో జాన్సెన్ (3: 6 బంతుల్లో) ఇలా అందరూ విఫలం అయ్యారు. దీంతో సన్‌రైజర్స్ 59 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. మరో 10, 20 పరుగుల్లో సన్‌రైజర్స్ కథ ముగుస్తుంది అనిపించింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. యష్ దయాళ్‌కు ఒక వికెట్ దక్కింది.
కానీ ఈ దశలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ (64: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), భువీ (27: 26 బంతుల్లో, మూడు ఫోర్లు) మాత్రం జట్టును ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు వీరిద్దరూ 68 పరుగులు జోడించారు. అయితే లక్ష్యం పెరిగిపోతూ ఉండటంతో భారీ షాట్‌కు ప్రయత్నించి హెన్రిచ్ క్లాసెన్ అవుటయ్యాడు. చివర్లో మయాంక్ మార్కండే (18: 9 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడినా విజయానికి అది సరిపోలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను (0: 3 బంతుల్లో) భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్లోనే అవుట్ చేశాడు. అయితే అక్కడి నుంచే సన్‌రైజర్స్‌కు కష్టాలు మొదలయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (47: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101: 58 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ బౌండరీలతో చెలరేగాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ 65 పరుగులు చేసింది. ఆ తర్వాత కేవలం 22 బంతుల్లోనే అర్థశతకం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా వేగంగా ఆడారు. సన్‌రైజర్స్ చెత్త ఫీల్డింగ్ కూడా వీరికి కలిసొచ్చింది. క్యాచ్ డ్రాప్‌లు, రనౌట్ మిస్‌లు, మిస్ ఫీల్డ్‌లు ఇలా ఎన్నో అవకాశాలు ఇచ్చారు.
రెండో వికెట్‌కు 147 పరుగులు జోడించిన అనంతరం సాయి సుదర్శన్‌ను అవుట్ చేసి మార్కో జాన్సెన్ రెండో వికెట్ అందించాడు. ఆ తర్వాత గుజరాత్ ఇన్నింగ్స్ పతనం అయింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భువనేశ్వర్ వేసిన చివరి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడ్డాయి. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, ఫజల్‌హక్ ఫరూకీ, టి నటరాజన్‌లకు తలో వికెట్ దక్కింది.