RCB, IPL 2023:
పాపం.. ఆర్సీబీ! ప్రతి సీజన్లోనూ ఈ సాలా కప్ నమదే అంటూ రావడం.. రెండు మూడు మ్యాచుల్లో మెరవడం.. మధ్యలో ఫామ్ కోల్పోవడం.. ప్లేఆఫ్ చేరకుండానే ఇంటి ముఖం పట్టడం ఒక ఆనవాయితీగా మార్చుకుంది! ఇప్పటికి 15 సీజన్లుగా ఇదే వరస! పదహారో సీజన్ కూడా మినహాయింపేమీ లేదు!
మే నెల ఆరో తారీకు చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఫ్లేఆఫ్ అవకాశాలు 51 శాతంగా ఉండేవి. మూడు రోజుల వ్యవధిలోనే.. అంటే మే 9కి అది 23 శాతానికి పడిపోయింది. ఇకపై ఆ జట్టు ప్లేఆఫ్ ఆడాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలవాల్సిందే! లేదంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్లు ముందుకు వెళ్లిపోతాయి.
ఈ మూడు రోజుల్లోనే ఆర్సీబీ అవకాశాలు తగ్గిపోవడానికి రెండే కారణాలు! వరుసగా రెండు మ్యాచుల్లో 20, 21 బంతులు మిగిలుండగానే ప్రత్యర్థులు విజయాలు సాధించడం! అరుణ్ జైట్లీ మైదానంలో దిల్లీ క్యాపిటల్స్, వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్.. బెంగళూరును ఉతికారేశాయి! దాంతో ఆ జట్టులో చీమూ నెత్తురూ కనిపించకుండా పోయింది.
మే 6న అరుణ్ జైట్లీ మైదానంలో దిల్లీ, బెంగళూరు తలపడ్డాయి. మొదట ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను వార్నర్ సేన అలవోకగా ఛేదించేసింది. జస్ట్ 16.4 ఓవర్లకే గెలిచేసింది. ఈ మ్యాచులో ఫిల్‌సాల్ట్ (87; 45 బంతుల్లో) కొట్టిన కొట్టుడుకు విరాట్ కోహ్లీకి ఏం చేయాలో అర్థమవ్వలేదు! ఇక ముంబయి ఇండియన్స్ దిల్లీని మంచి దంచికొట్టింది. వారి టార్గెట్ కన్నా ఎక్కువ స్కోరును వారి కన్నా ఒక బంతి తక్కువకే ఊదేసింది.
వాంఖడేలో బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 199 రన్స్ చేయగా.. ఇషాన్ కిషన్ (42; 21 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్ (83; 35 బంతుల్లో), నేహాల్ వధేరా (52; 34 బంతుల్లో) ఉతికారేశారు. దాంతో 16.3 ఓవర్లకే ముంబయి టార్గెట్‌ను ఫినిష్ చేసింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి వెళ్లి సెటిలైంది. ప్లేఆఫ్ అవకాశాలను 62 శాతానికి పెంచేసుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. 11 మ్యాచుల్లో 5 గెలిచి 6 ఓడింది. -0.345 రన్‌రేట్‌తో నిలిచింది. లీగులో మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. 14న రాజస్థాన్ రాయల్స్, 18న సన్‌రైజర్స్, 21న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మూడు మ్యాచుల్లో గెలవడం అంత సులభమేమీ కాదు. ముఖ్యంగా రాజస్థాన్ ప్లేఆఫ్ చేరుకోవాలని బలమైన పట్టుదలతో ఉంది. పైగా మెరుగైన రన్‌రేట్ ఉంది. ఆశలు నిలవాలంటే సన్‌రైజర్స్ వరుసగా గెలవాలి. అలాంటప్పుడు ప్రతి మ్యాచునూ సవాల్‌గానే తీసుకుంటుంది.