CSK vs DC Preview:  


ఇండియన్ ప్రీమియర్‌ లీగు 2023లో నేడు 55వ మ్యాచ్‌ జరుగుతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ (CSK vs DC) తలపడుతున్నాయి. చెపాక్‌ ఇందుకు వేదిక. ఆశలు సజీవంగా ఉండాలంటే వార్నర్‌ సేన కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ ఇది! మరి నేటి పోరులో గెలిచేదెవరో?


ప్లేఆఫ్‌కు దగ్గర్లో!


ఈ సీజన్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings) ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే! లిమిటెడ్‌ రిసోర్సెస్‌తో అద్భుతంగా ఆడుతోంది. బ్యాటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ బౌలర్లపై ఒత్తిడి లేకుండా చేస్తోంది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే వీరోచిత ఫామ్‌లో ఉన్నారు. ఆడిన పది మ్యాచుల్లో ఎనిమిది సార్లు 50 పరుగుల ఓపెనింగ్‌ పాట్నర్‌షిప్స్‌ అందించారు. ఇక అజింక్య రహానె, శివమ్‌ దూబె స్ట్రైక్‌రేట్‌ బీభత్సంగా ఉంది. ఒక్కరూ తగ్గేదే అన్నట్టుగా ఆడుతున్నారు. రవీంద్ర జడేజా ఫినిషర్‌గా మారిపోయాడు. అంబటి రాయుడి నుంచి ఆశించేదేమీ లేదు. బెన్‌స్టోక్స్‌ అందుబాటులో ఉండొచ్చు. అయితే అతడికి చోటిచ్చే అవకాశం కనిపించడం లేదు. కాన్వే, మొయిన్‌ అలీ, పతిరణ, తీక్షణ అదరగొడుతున్నారు. వారిని కాదని అతడిని తీసుకోలేరు. పైగా డెత్‌ ఓవర్లలో పతిరణను ఆడటం కష్టంగా మారింది. ఈ మ్యాచ్‌ గెలిస్తే 15 పాయింట్లతో సీఎస్కే ప్లేఆఫ్‌ను దాదాపుగా ధ్రువీకరించుకుంటుంది.


ఆశలు సజీవం!


మొదట్లో వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయిన దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) ఆ తర్వాత పుంజుకుంది. చివరి ఐదు మ్యాచుల్లో 4 గెలిచింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ డిపార్ట్‌మెంట్లను పటిష్ఠం చేసుకుంది. తుది కూర్పు కుదురుతోంది. ఆర్సీబీ పెట్టిన టార్గెట్‌ను ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఛేదించేశారు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, ఫిల్‌సాల్ట్‌ బ్లాస్టింగ్‌ ఓపెనింగ్‌ ఇచ్చారు. ముఖ్యంగా సాల్ట్‌ కొట్టిన షాట్లు హైలైట్‌. మిచెల్‌ మార్ష్‌, రిలీ రొసో ఫామ్‌లోకి వచ్చారు. అక్షర్ పటేల్‌ కీలకంగా ఆడుతున్నాడు. మనీశ్‌ పాండే తన స్థాయి ఇన్నింగ్స్‌ ఆడలేదు. చెపాక్‌లో వీరంతా జాగ్రత్తగా ఆడాలి. లేదంటే ధోనీ వ్యూహాలకు చెల్లాచెదురైపోతారు. ఇషాంత్‌ శర్మ రాకతో బౌలింగ్‌ బలం పెరిగింది. ఖలీల్‌, ముకేశ్, మార్ష్‌ పేస్‌ బౌలింగ్‌ వేస్తున్నారు. కుల్‌దీప్‌, అక్షర్‌ స్పిన్‌ చూస్తున్నారు. ఆన్రిచ్‌ నోకియా అర్జెంట్‌ పనిమీద సొంత దేశం వెళ్లాడు. అతడు తిరిగొస్తే మరింత పటిష్ఠంగా మారుతుంది.


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.


ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:  డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపుల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్.