Jos Buttler: ఫాంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ప్రత్యేకమైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని జోస్ బట్లర్ చేరుకున్నాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ ఈ రికార్డు సాధించాడు.


జోస్ బట్లర్ ఈ మైలురాయిని చేరుకోవడానికి 85 ఇన్నింగ్స్ పట్టింది. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న మూడో ఆటగాడిగా జోస్ బట్లర్ నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ కేవలం 75 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 80 ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్న కేఎల్ రాహుల్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.


జోస్ బట్లర్‌కు ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు 17 అర్థ సెంచరీలు ఉన్నాయి. 40కి పైగా సగటు, 150కి పైగా స్ట్రైక్ రేట్ ఉండటం విశేషం. ఐపీఎల్‌లో మూడు వేల పరుగులు సాధించిన 21వ బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. వీరిలో 14 మంది భారతీయ బ్యాట్స్‌మెన్ కాగా, ఏడుగురు విదేశీ ఆటగాళ్లు. డేవిడ్ వార్నర్ (6090), ఏబీ డివిలియర్స్ (5162), షేన్ వాట్సన్ (3623), ఫాఫ్ డుఫ్లెసిస్ (3578), కీరన్ పొలార్డ్ (3412) ఈ జాబితాలో ఉన్నారు. ఐపీఎల్ జోస్ బట్లర్ ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడాడు. 2016లో బట్లర్ మొదటిసారి ఐపీఎల్ ఆడాడు.


చెపాక్‌లో సంజూ సేన అద్భుతం చేసింది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ను టెన్షన్‌ పెట్టించింది. ధోనీ సేన చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను ఆఖరి బంతికి లాగేసుకుంది. 3 పరుగుల తేడాతో అమేజింగ్‌ విక్టరీ అందుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఛేదనకు దిగిన సీఎస్‌కేను 172/6కు పరిమితం చేసింది. డేవాన్‌ కాన్వే (50; 38 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ చేశాడు. ఎంఎస్‌ ధోనీ (32*; 17 బంతుల్లో 1x4, 3x6), రవీంద్ర జడేజా (25*; 15 బంతుల్లో 1x4, 2x6) మెరుపు షాట్లు బాదేశారు. అంతకు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌లో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (52; 36 బంతుల్లో 1x4, 3x6) హాఫ్‌ సెంచరీ కొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (38; 26 బంతుల్లో 5x4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (30; 22 బంతుల్లో 1x4, 2x6) రాణించారు. ఆఖర్లో షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (30*; 10 బంతుల్లో 1x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు.


ఛేజింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్‌ స్టార్ట్‌ రాలేదు. సందీప్‌ శర్మ వేసిన 2.2వ బంతికే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో అజింక్య రహానె (31; 19 బంతుల్లో 2x4, 1x6) అండతో మరో ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే నిలబడ్డాడు. వీరిద్దరూ అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించారు. మరో వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి సీఎస్కే 45/1తో నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచి రెండో వికెట్‌కు 43 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించారు. రన్‌రేట్‌ పెరగకుండా అడ్డుకున్న ఈ జోడీని జట్టు స్కోరు 78 వద్ద రహానెను ఎల్బీ చేయడం ద్వారా అశ్విన్‌ విడదీశాడు. ఆ తర్వాత శివమ్‌ దూబె (8), మొయిన్‌ అలీ (7), అంబటి రాయుడు (1) వెంటవెంటనే ఔటవ్వడంతో మెరుగైన భాగస్వామ్యాలు రాలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కాన్వే 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి అతడిని చాహల్‌ ఔట్‌ చేశాడు. దాంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 40గా మారింది. ధోనీ అండతో 19వ ఓవర్లో జడేజారెండు సిక్సులు, ఒక బౌండరీ బాది 19 రన్స్‌ అందించాడు. ఆఖరి ఓవర్లో 21 రన్స్‌ అవసరం కాగా.. సందీప్‌ శర్మ 17 రన్సే ఇచ్చాడు. అయితే మహీ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి రాయల్స్‌ను భయపెట్టాడు. ఆఖరి బంతికి 5 రన్స్‌ అవసరం ఉండగా సింగిల్‌ మాత్రమే తీశాడు.