Sanju Samson - MS Dhoni: 


చెపాక్‌ స్టేడియంలో మ్యాచ్‌ గెలవడం ఆనందంగా ఉందని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు. తనకిక్కడ మధుర స్మృతులేమీ లేవన్నాడు. అందుకే చెన్నై ఓడించేందుకు శ్రమించామని తెలిపాడు. ఎంఎస్ ధోనీని అడ్డుకొనేందుకు డేటా టీమ్‌తో కలిసి రీసెర్చ్‌ చేశామని.. అయినా అతడి ముందు తమ పాచికలు పారలేదని వెల్లడించాడు. సీఎస్‌కేపై విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


'గెలుపు ఘనత మా కుర్రాళ్లకే దక్కుతుంది. ఆఖరి వరకు బౌలర్లు కూల్‌గా ఉన్నారు. చక్కగా బౌలింగ్‌ చేశారు. ఫీల్డర్లూ ఎలాంటి పొరపాట్లు చేయలేదు. క్యాచులను అద్భుతంగా అందుకున్నారు. చెపాక్‌లో నాకేమీ మెమరీస్‌ లేవు. నేనెప్పుడూ ఇక్కడ గెలవలేదు. అందుకే విజయం కోసం గట్టిగా ప్రయత్నించాం. బంతి గ్రిప్‌ అవుతుండటంతో ఆడమ్‌ జంపాను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకున్నాం. రుతురాజ్‌ను ఔట్‌ చేయడం పవర్‌ప్లేలో మాకు పాజిటివ్‌గా మారింది' అని సంజూ శాంసన్‌ అన్నాడు.




'పవర్‌ప్లేలో రుతురాజ్‌ను ఔట్‌ చేసి తక్కువ పరుగులివ్వాలని మేం అనుకున్నాం. ఆ తర్వాత స్పిన్నర్లు చూసుకుంటారని ప్లాన్‌ చేశాం. ఆఖరి రెండు ఓవర్లు టెన్షన్‌ పడ్డాం. ఆటను మరింత చివరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాను. కానీ ఎంఎస్‌ ధోనీ క్రీజులో ఉన్నంత వరకు మేం సేఫ్‌ కాదని తెలుసు. డేటా టీమ్‌తో కలిసి నేనెంతో రీసెర్చ్‌, ప్లానింగ్‌ చేస్తాను. చాలా చాలా ఆలోచనలు వచ్చాయి. కానీ అతడి ముందు అవేమీ పనిచేయలేదు' అని సంజూ పేర్కొన్నాడు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు చరిత్రలో చెపాక్‌లో రాజస్థాన్‌ రెండేసార్లు గెలిచింది. 2008 తర్వాత తొలిసారి 2023లో విజయం సాధించింది. ఆఖరి బంతికి ధోనీసేన నుంచి విజయం లాగేసుకుంది. అయితే ఈ మ్యాచులో సంజూ డకౌట్‌ అయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన బంతి టర్న్‌ అయి బ్యాటు, ప్యాడ్ల మధ్య నుంచి వెళ్లి వికెట్లను తాకేసింది.


IPL 2023, CSK vs RR: 


చెపాక్‌లో సంజూ సేన అద్భుతం చేసింది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ను టెన్షన్‌ పెట్టించింది. ధోనీ సేన చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను ఆఖరి బంతికి లాగేసుకుంది. 3 పరుగుల తేడాతో అమేజింగ్‌ విక్టరీ అందుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఛేదనకు దిగిన సీఎస్‌కేను 172/6కు పరిమితం చేసింది. డేవాన్‌ కాన్వే (50; 38 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ చేశాడు. ఎంఎస్‌ ధోనీ (32*; 17 బంతుల్లో 1x4, 3x6), రవీంద్ర జడేజా (25*; 15 బంతుల్లో 1x4, 2x6) మెరుపు షాట్లు బాదేశారు. అంతకు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌లో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (52; 36 బంతుల్లో 1x4, 3x6) హాఫ్‌ సెంచరీ కొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (38; 26 బంతుల్లో 5x4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (30; 22 బంతుల్లో 1x4, 2x6) రాణించారు. ఆఖర్లో షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (30*; 10 బంతుల్లో 1x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు.